ప్రయాణికులకు శంషాబాద్ ఎయిర్‌పోర్టు అధికారుల గుడ్‌న్యూస్
శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి మరో నాలుగు సర్వీసులను అందుబాటులోకి తెస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
By Srikanth Gundamalla Published on 18 Nov 2023 11:59 AM ISTప్రయాణికులకు శంషాబాద్ ఎయిర్‌పోర్టు అధికారుల గుడ్‌న్యూస్
హైదరాబాద్ శివారులో ఉన్న శంషాబాద్ రాజీవ్‌గాంధీ ఇంటర్నేషన్ ఎయిర్‌పోర్టు ఎంతో ప్రసిద్ధిగాంచింది. ఇక్కడి ననుంచి అనేక దేశాలకు విమానాల రాకపోకలు నిత్యం కొనసాగుతూ ఉంటాయి. అంతేకాదు.. దేశంలోని అనేక ప్రధాన నగరాలకు కూడా దేశీయ విమానాలు అందుబాటులో ఉంటాయి. ఈ విమానాశ్రయంలో ఈ మధ్యకాలంలోనే కొత్త టెర్మినల్‌ను ప్రారంభించారు కూడా. తాజాగా విమాన ప్రయాణికులకు ఆర్జీఐఏ అధికారులు మరో గుడ్‌న్యూస్ చెప్పారు.
ఇప్పటికే శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి అనేక విమాన సర్వీసులు ఉండగా.. మరో నాలుగు సర్వీసులను కూడా అందుబాటులోకి తెస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సహకారంతో ఈ విమానాలు ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చామని అధికారులు చెప్పారు. కొచ్చి, గ్వాలియర్, అమృత్‌సర్‌తో పాటు లక్నోకు కనెక్షన్లు ఉంటాయని చెప్పారు. ఈ విషయాన్ని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు అధికారులు వెల్లడించారు. శుక్రవారం నుంచే లక్నో, అమృత్‌సర్, కొచ్చిలకు సర్వీసులు ప్రారంభించామని జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ సీఈవో ప్రదీప్ పణిక్కర్ తెలిపారు. ఇక గ్వాలియర్ సర్వీసులు నవంబర్ 28 నుంచి ప్రారంభం అవుతాయని ప్రదీప్ పణిక్కర్ చెప్పారు. మెరుగైన ప్రయాణ సౌకర్యాల కోసం ఎయిర్‌ఇండియా ఎక్స్‌ప్రెస్ ముందుకు రావడం సంతోషమని ఈ సందర్భంగా చెప్పారు.
ఆయా సర్వీసుల సమయాలను కూడా అధికారులు ప్రకటించారు. అమృత్‌సర్‌కు వెళ్లే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం ప్రతిరోజు ఉదయం 7:30 గంటలకు శంషాబాద్ నుంచి బయల్దేరి.. 10.15 గంటలకు గమ్యస్థానానికి చేరుకోనుంది. కొచ్చికి వెళ్లే విమానం రోజూ రాత్రి 7.45 గంటలకు బయల్దేరి.. రాత్రి 9.30 గంటలకు చేరుకుంటుంది. శంషాబాద్ నుంచి లక్నోకు వారానికి ఆరు సర్వీసులు ఉంటాయని చెప్పారు. విమానం శంషాబాద్ నుంచి మధ్యాహ్నం 2.30 గంటలకు బయల్దేరి.. 4.30 గంటలకు లక్నోకు చేరుకుంటుంది. శంషాబాద్-గ్వాలియర్ మధ్య వారానికోసారి మూడు సర్వీసులు ఉంటాయని తెలిపారు. ఇది మ.2.30 గంటలకు బయల్దేరి సాయంత్రం 4.20కి గ్వాలియర్ చేరుకోనుంది. తాజాగా ప్రవేశపెట్టిన సర్వీసులను ఆయా ప్రయాణికులు వినియోగించుకోవాల్సిందిగా శంషాబాద్ ఎయిర్‌పోర్టు అధికారులు కోరారు.