నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మెండోరా మండలం పోచంపాడు వీఐపీ పుష్కరఘాట్ వద్ద గోదావరిలో పుణ్యస్నానాల కోసం వచ్చిన ఏడుగురు వ్యక్తులు నదిలో గల్లంతు అయ్యారు. వీరిలో ఒకరు సురక్షితంగా బయటపడగా.. మరో ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. గల్లంతైన మరో నలుగురి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. శుక్రవారం ఉదయం డిచ్‌పల్లి, మాక్లుర్, నిజామాబాద్ ప్రాంతాలకు చెందిన మూడు కుటుంబాల వారు గోదావరిలో స్నానానికి వెళ్లారు.
ప్రతి శుక్రవారం గోదావరిలో తెప్ప దీపం సమర్పించేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తుంటారు. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం స్నానాలు చేసేందుకు నదిలో దిగిన సమయంలో ఇద్దరు చిన్నారులు నదిలో పడిపోయారు. వారిని రక్షించేందుకు మరో ఐదుగురు నీటిలోకి దిగారు. ఇందులో ముగ్గురు పెద్దలు, నలుగురు చిన్నారులు ఉన్నారు. వీరి అరుపులో అప్రమత్తమైన స్థానికులు వెంటనే నదిలోకి దిగి ఓ బాలుడిని రక్షించారు. అయితే.. అప్పటికే మిగతా వారు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు అక్కడకు చేరుకుని వెంటనే గత ఈతగాళ్ల సాయంతో వారి కోసం గాలింపు చేపట్టారు.
ఇప్పటి వరకు ఇద్దరి మృతదేహాలు లభ్యం అయ్యాయి. మిగతా నలుగురి కోసం గాలిస్తున్నారు. అక్కడకు చేరుకున్న మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గల్లంతయిన వారిలో నిజామాబాద్ ఎల్లమ్మగుట్టకు చెందిన జీలకర్ర సురేష్, యోగేష్, బొబ్బిలి శ్రీనివాస్, శ్రీధర్, శ్రీకర్, దొడ్లే రాజుగా గుర్తించారు.