హైదరాబాద్: రాష్ట్రంలో గత ఐదేళ్లలో 2.24 లక్షల మంది పెన్షన్‌దారులు సొంతూళ్ల నుంచి వలస వెళ్లినట్టు రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) గుర్తించింది. వరుసగా 3 నెలల పింఛన్ తీసుకోకపోతే అధికారులు జాబితా నుంచి పేరు తొలగిస్తున్నారు. ఈ క్రమంలోనే అలాంటి వారు సొంతూరుకు వస్తే పెన్షన్‌ను పునరుద్ధరణకు అవకాశం కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు అవకాశం కల్పించనున్నట్టు సెర్ప్ వెల్లడించింది. ప్రస్తుతం దివ్యాంగులకు రూ.4,016, ఇతరులకు రూ.2,016 పెన్షన్ అందుతోంది.
రాష్ట్రంలో మొత్తంగా 42.96 లక్షల మంది ఆసరా పెన్షన్లు పొందుతున్నారు. అయితే ప్రతి నెలా పెన్షన్ల కేటాయింపులు మిగిలి పోతుండటంతో సెర్ప్ విస్తృతస్థాయిలో పరిశీలనలు జరిపింది. గడిచిన ఐదేళ్ల సమాచారం సేకరించగా.. 2,24,125 మంది వలస వెళ్లినట్టు తేలింది. వలస వెళ్లిన వారిలో అత్యధికంగా వృద్ధులు, ఆ తర్వాత వితంతువులు, దివ్యాంగులు ఉన్నారు. చాలా మంది తమ కుటుంబ పరిస్థితుల దృష్ట్యా ఉపాధి కోసం నగరాలకూ, పట్టణాలకు వలస వెళ్లినట్టు అధికారులు గుర్తించారు.