'నా ప్రతిష్టకు తీవ్ర భంగం కలిగింది'.. ఈడీకి ఎమ్మెల్సీ కవిత లేఖ

ఈడీ దర్యాప్తు అధికారి జోగేంద్రకు భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన లేఖ రాశారు.

By అంజి  Published on  21 March 2023 12:33 PM IST
MLC Kalvakuntla Kavitha, ED, Delhi

'నా ప్రతిష్టకు తీవ్ర భంగం కలిగింది'.. ఈడీకి ఎమ్మెల్సీ కవిత లేఖ

ఈడీ దర్యాప్తు అధికారి జోగేంద్రకు భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన లేఖ రాశారు. ఫోన్ల ధ్వంసం ఆరోపణ చేయడాన్ని కవిత తీవ్రంగా తప్పుపట్టారు. దురుద్దేశ పూర్వకంగా వ్యవహరిస్తున్నప్పటికీ కూడా తాను గతంలో వాడిన ఫోన్లను సమర్పిస్తున్నానని చెప్పారు. ఒక మహిళ ఫోన్‌ని స్వాధీనం చేసుకోవడం గోప్యత హక్కుకు భంగం కలగదా? అంటూ ప్రశ్నించారు. దుర్బుద్ధితో వ్యవహరిస్తున్న దర్యాప్తు సంస్థ.. తాను ఫోన్లను ధ్వంసం చేశానని పేర్కొంది.

తనను కనీసం సమన్ చేయకుండా లేదా అడగకుండానే ఏ పరిస్థితుల్లో ఎందుకు దర్యాప్తు సంస్థ ఈ ఆరోపణలు చేసిందని ప్రశ్నించారు. తనను తొలిసారిగా మార్చి నెలలో విచారణ కోసం ఈడీ పిలిచిందని, కానీ గత ఏడాది నవంబరులోనే ఫోన్లు ధ్వంసం చేశానని ఈడీ ఆరోపించడం అంటే దురుద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేయడమేనని ఎమ్మెల్సీ కవిత అన్నారు.

తప్పుడు ఆరోపణను ఉద్దేశపూర్వకంగా లీకేజీ ఇవ్వడం వల్ల తన రాజకీయ ప్రత్యర్థులు తనను ప్రజల్లో నిందిస్తున్నారని అన్నారు. తద్వారా తన ప్రతిష్టకు తీవ్ర భంగం కలగడమే కాకుండా తన పరువును, తమ పార్టీ ప్రతిష్టను ప్రజల్లో తగ్గించే ప్రయత్నం జరిగిందన్నారు. రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఈడీ వంటి దర్యాప్తు సంస్థ నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలన్న విధిని తొక్కిపెట్టి వ్యవహరించడం దురదృష్టకరమని కవిత అన్నారు.

అయితే ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఎలా స్పందిస్తుందనేది ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.

ఈడీ విచారణకు ఎమ్మెల్సీ కవిత

ఇవాళ మరోసారి ఈడీ విచారణకు కవిత హాజరయ్యారు. ఉదయం 11.30 గంటలకు ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. కవితతో పాటు, ఆమె భర్త, బీఆర్‌ఎస్‌ నాయకులు ఉన్నారు. ఈడీ ఆఫీసులోకి కవితను మాత్రమే అనుమతించారు. కవిత ఈడీ విచారణకు హాజరుకావడం ఇది మూడోసారి. కవిత విచారణకు వెళ్లే సమయంలో తన ఫోన్లను కూడా తీసుకెళ్లారు. దీంతో లిక్కర్‌ స్కామ్‌కు సంబంధించిన ఈడీ విచారణ కీలకంగా మారింది.

Next Story