ఏపీకి ప్రత్యేక హోదాపై తెలంగాణ మంత్రి సంచలన కామెంట్స్

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన కామెంట్స్‌ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం తన వంతు ప్రయత్నం చేస్తానన్నారు.

By అంజి
Published on : 12 Dec 2023 12:35 PM IST

Telangana Minister, Komati Reddy Venkat Reddy, AP special status, APnews

ఏపీకి ప్రత్యేక హోదాపై తెలంగాణ మంత్రి సంచలన కామెంట్స్

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన కామెంట్స్‌ చేశారు. మంగళవారం నాడు దేశ రాజధాని ఢిల్లీలోని తెలంగాణలో భవన్‌లో మీడియాతో మాట్లాడిన మంత్రి కోమటిరెడ్డి.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా గత ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్, సోనియాగాంధీ తీసుకున్న నిర్ణయం అని తెలిపారు. ఏపీని ఆదుకోవాలని పార్లమెంట్‌లో ఇచ్చిన హామీ అది అని చెప్పుకొచ్చారు. విభజన సమయంలో ఇచ్చిన హామీని అమలుపరచకపోవడం బాధాకరమని అన్నారు.

ఏపీకి ప్రత్యేక హోదా కోసం తన వంతు ప్రయత్నం చేస్తానన్నారు. ప్రధాని హోదాలో మన్మోహన్ ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చారని, ఇక ప్రస్తుత ప్రధాని మోదీ దానిపై నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో త్వరలో తెలంగాణ భవన్ నిర్మిస్తామని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. ఉమ్మడి ఏపీ భవన్‌ విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం లేదని అన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ నాటికి ఢిల్లీలో తెలంగాణ భవన్‌ నిర్మాణ పనులను చేపట్టాలనుకుంటున్నామని తెలిపారు.

భవన్ నిర్మాణానికి సంబంధించిన అంశాన్ని ముఖ్యమంత్రి ముందు ఉంచుతామని చెప్పారు. తెలంగాణ ప్రజాప్రతినిధులకు, అధికారులకు అనువుగా భవన్ నిర్మాణం చేస్తామని అన్నారు. ఇదిలా ఉంటే.. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్‌తో భేటీ కానున్నట్లు మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో రోడ్ల నిర్మాణంపై చైర్మన్‌తో చర్చిస్తానని తెలిపారు. తెలంగాణలో 340 కిలోమీటర్ల మేర హైవేను ఆరు లైన్లుగా నిర్మాణం చేయాలని కోరనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెల్లడించారు.

Next Story