తెలంగాణలో విద్యుత్ కొత్త కనెక్షన్ల జారీలో గురువారం నుంచి భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి ఇందుకోసం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. స్తంభాలు, లైన్స్ కోసం వినియోగదారుల నుంచి దూరాన్ని బట్టి ఒక్కో రీతిలో డబ్బు వసూలు చేసేవారు. అయితే ఇకపై ఫిక్స్‌డ్ ఛార్జీలు వసూలు చేయనున్నారు. కొత్త నిబంధనల ప్రకారం, విద్యుత్ లైన్ నుంచి ఒక కిలోమీటరు పరిధిలో ఉన్న నివాసాలకు కేవలం లోడ్ ఆధారంగా మాత్రమే ఛార్జీలు ఉంటాయి.
ఉదాహరణకు, 1 కిలోవాట్ కనెక్షన్‌కు రూ. 500, మరియు 1 నుంచి 5 కిలోవాట్ల వరకు గరిష్టంగా రూ. 3,500 మాత్రమే వసూలు చేస్తారు. అపార్ట్‌మెంట్లు, కమర్షియల్ భవనాలకు కూడా ఇదే తరహాలో నిర్ణీత రుసుములను ఖరారు చేశారు. రైతులకు కూడా ఇది పెద్ద ఊరటనిచ్చే అంశం. వ్యవసాయ కనెక్షన్ల కోసం కేవలం కిలోవాట్‌కు రూ. 1,000 చెల్లిస్తే సరిపోతుంది. కాగా ఈ కొత్త మార్గదర్శకాలు రేపటి నుంచి అమలులోకి రానున్నాయి.