హైదరాబాద్‌లో సీనియర్ మహిళా మావోయిస్టు నాయకురాలు అరెస్ట్

హైదరాబాద్‌లోని న్యూ హఫీజ్‌పేటలో నిషేధిత సీపీఐ (మావోయిస్ట్) పార్టీకి చెందిన సీనియర్ మహిళా నాయకురాలిని మియాపూర్ పోలీసులు అరెస్టు చేశారు

By Knakam Karthik
Published on : 26 July 2025 12:27 PM IST

Hyderabad News, Senior Women Maoist Leader Sri Vidya, Narla Srividya, Telangana police

హైదరాబాద్‌లో సీనియర్ మహిళా మావోయిస్టు నాయకురాలు అరెస్ట్

హైదరాబాద్‌లోని న్యూ హఫీజ్‌పేటలో నిషేధిత సీపీఐ (మావోయిస్ట్) పార్టీకి చెందిన సీనియర్ మహిళా నాయకురాలిని మియాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీవిద్య హఫీజ్ పేటలో ఉంటూ చికిత్స పొందుతున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో ఆమె కదలికలపై నిఘా పెట్టారు. మియాపూర్ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమెను కోర్టులో హాజరుపరచకపోవడంతో పలు పౌర సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. దీంతో ఆమె అరెస్టును పోలీసులు ధ్రువీకరించారు. శ్రీవిద్య అరెస్టును మాదాపూర్ జోన్ డీఎస్పీ వినీత్ వెల్లడించారు. ఈ మావోయిస్టు నేతపై రూ.5 లక్షల రివార్డు ఉన్నట్లు తెలిపారు.

నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం తిరుమలాపురం గ్రామానికి చెందిన శ్రీవిద్య అలియాస్ రూప అలియాస్ కరుణ జేఎన్టీయూలో బీటెక్ పూర్తి చేసింది. తండ్రి ఉపాధ్యాయుడు కాగా, సోదరుడు రవి శర్మ, సోదరి శ్రీదేవి గతంలో మావోయిస్టు ఉద్యమంలో కీలక నేతలుగా ఉన్నారు. సోదరుడి స్ఫూర్తితో మావోయిస్టు పార్టీ పట్ల ఆకర్షితురాలై 1992లో పీపుల్స్ వార్ అనుబంధ సంస్థ చైతన్య మహిళా సమాఖ్య సభ్యురాలిగా చేరింది.

2006లో మావోయిస్టు పార్టీలో చేరిన ఆమె విశాఖ, మల్కనగిరి, దంతెవాడ, బీజాపూర్, సుక్మా, నారాయణపూర్, కంకేర్, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాలలో పని చేసింది. ఐపీఎస్ అధికారి ఉమేష్ చంద్ర హత్య కేసులో కీలకంగా వ్యవహరించిన మావోయిస్టు అగ్రనేత తక్కలపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్నను ఆమె వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఆమె దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా ఉన్నారు. ఈమెపై 2019లో ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో క్రిమినల్ కేసు నమోదై ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు. దీంతో ఆమెను ఎల్బీనగర్ కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. న్యాయమూర్తి ఆదేశాలతో రిమాండ్‌కు తరలించారు.

Next Story