మునుగోడులో కష్టంగా మారనున్న అభ్యర్థుల ఎంపిక

Selection of candidates will become difficult for Munugod Bypoll. మునుగోడు తెలంగాణ రాజకీయాలతో పాటుగా, అందరి దృష్టి ఇప్పుడు అక్కడే కేంద్రీకృతమైంది

By Nellutla Kavitha  Published on  3 Aug 2022 8:17 PM IST
మునుగోడులో కష్టంగా మారనున్న అభ్యర్థుల ఎంపిక

మునుగోడు తెలంగాణ రాజకీయాలతో పాటుగా, అందరి దృష్టి ఇప్పుడు అక్కడే కేంద్రీకృతమైంది. సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా ప్రకటనతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యం అయింది. కాంగ్రెస్ పార్టీలో ఎప్పటినుంచో దిక్కార స్వరం, అసమ్మతి గళం వినిపించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీని వీడుతారనే ఊహాగానాలకు తెరపడింది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా తో పాటుగా, కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు ప్రకటన చేశారు రాజగోపాల్ రెడ్డి. అయితే ఏ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించక పోయినప్పటికీ బీజేపీ మాత్రం అసెంబ్లీలో ఇప్పటికే త్రిపుల్ ఆర్ గా ఉన్న తమ ఎమ్మెల్యేల సంఖ్యలో మరొక ఆర్ జత కలుస్తున్నట్లుగా ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే పాలకపక్షం టిఆర్ఎస్ తో పాటుగా కాంగ్రెస్, బిజెపి మునుగోడు ఉప ఎన్నిక అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి.

2024లో రాబోతున్న సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్ గా అంచనాలు వేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఉప ఎన్నికలు వస్తే తప్ప నియోజకవర్గ అభివృద్ధి జరగదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపణలు చేశారు. నయా నిజాంలా పరిపాలిస్తున్న కెసిఆర్ అరాచక పాలనకు మోడీ, అమిత్ షా చెక్ పెడుతారు అంటూ రాజగోపాల్ రెడ్డి ఘాటుగా మాట్లాడారు. ముందు నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారతారని, అక్కడ ఉప ఎన్నిక అనివార్యం అని అంచనా వేస్తూ వచ్చిన పాలకపక్షం, మునుగోడు పై స్పెషల్ ఫోకస్ పెట్టింది. పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడంతో పాటుగా, అక్కడ ఉన్న సమస్యల పరిష్కారం దిశగా కూడా అడుగులు వేస్తోంది టిఆర్ఎస్. ఇక సిట్టింగ్ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకోవడానికి తమకున్న అన్ని శక్తులను, బలాలను మోహరింపు చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇక గతంలో వచ్చిన దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికలలాగే మునుగోడును కూడా కైవసం చేసుకోవాలని బిజెపి భావిస్తోంది. ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీలో ఉన్న బిజెపి ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘునందన్, ఈటెల రాజేందర్ లుకు తోడు రాజగోపాల్ రెడ్డి జాయిన్ అవుతారని ప్రచారం మొదలుపెట్టారు కమలనాథులు.

అయితే టిఆర్ఎస్ తో పాటుగా కాంగ్రెస్ కి అభ్యర్థుల ఎంపిక కష్టతరం కానుంది. ఇప్పటికే ఆశావహుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతోంది. సర్వేలు, సమీకరణాల మీద కాంగ్రెస్, టిఆర్ఎస్ ఆధారపడుతున్నాయి. సామాజిక సమీకరణాల మీద కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఏర్పడింది పార్టీలకు. మునుగోడులో 40 శాతానికి పైగా బిసి ఓటర్లు ఉంటే, నాలుగు శాతం కూడా రెడ్డి సామాజిక వర్గం లేదు. అయినప్పటికీ మునుగోడు నియోజకవర్గంలో ముందు నుంచి మెజారిటీ ఎమ్మెల్యేలు రెడ్డి సామాజిక వర్గం నుంచే వచ్చారు. 1967 నుంచి 85 వరకు కాంగ్రెస్ పార్టీ తరఫున వరుసగా నాలుగు సార్లు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్యేగా మునుగోడు నుంచి ఎన్నికయ్యారు. 1985 నుంచి 1999 వరకు కమ్యూనిస్టు పార్టీ తరఫున ఉజ్జిని నారాయణరావు వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇప్పటిదాకా ఆరు సార్లు కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా మునుగోడు నుంచి ఎన్నికైతే, ఐదుసార్లు కమ్యూనిస్టు పార్టీకి చెందిన అభ్యర్థులు ఎన్నికయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 2014లో టిఆర్ఎస్ పార్టీ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2018 లో కాంగ్రెస్ పార్టీ తరఫున కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా ప్రకటన చేయడంతో మునుగోడులో ఉప ఎన్నిక అనివార్యమైంది.

ఈ ఉప ఎన్నికల్లో ఏ పార్టీ ఏ సామాజిక వర్గానికి, ఏ అభ్యర్థికి టికెట్ ఇవ్వబోతోంది? సర్వేలు, సమీకరణాలు ఎవరికి మొగ్గు చూపిస్తాయి? మునుగోడు రాజకీయం రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతోంది? ఆసక్తికర పరిణామాలు ఎలా మారబోతున్నాయి? తెలంగాణ రాష్ట్రమంతా ఎదురుచూస్తున్నా అంశం ఇదే.



Next Story