వందేభారత్ ఎక్స్‌ప్రెస్.. సికింద్రాబాద్-తిరుపతి వయా మిర్యాలగూడ
Secunderabad to Tirupati Vande Bharat Express Via Miryalaguda. తిరుపతి వెళ్లే యాత్రికుల సౌకర్యార్థం సికింద్రాబాద్
By తోట వంశీ కుమార్ Published on 12 Feb 2023 1:48 PM ISTకేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను తీసుకువచ్చింది. దేశ వ్యాప్తంగా సాధ్యమైనన్ని ఎక్కువ మార్గాల్లో వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలను సిద్దం చేస్తోంది. ఇప్పటికే ఆరు నుంచి ఏడు మార్గాల్లో రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఏడాది సంక్రాంతి నుంచి తెలుగు రాష్ట్రాల్లో సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నంకు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు పరుగులు పెడుతోంది. అదే విధంగా తిరుపతి వెళ్లే యాత్రికుల సౌకర్యార్థం సికింద్రాబాద్ నుంచి తిరుపతి మార్గంలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రవేశపెట్టాలని ఇప్పటికే అధికారులు నిర్ణయించారు.
సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్లేందుకు అందుబాటులో ఉన్న అన్ని మార్గాల్లో.. ఏ మార్గంలో రైలును నడపాలనే దానిపై అధికారులు కసరత్తు పూర్తి చేశారు. తొలుత వరంగల్- కాజీపేట మార్గంలో నడపాలని అధికారులు బావించారు. అయితే.. ఎక్కువ దూరం అవుతుండడంతో పాటు ప్రయాణ సమయం అధికంగా ఉండడంతో మరో మార్గాన్ని ఎంచుకున్నారు. అదే బీబీనగర్- నడికుడి.
బీబీనగర్- నడికుడి మార్గంలో మిర్యాలగూడ మీదుగా వందే భారత్ రైలును నడపాలని రైల్వే అధికారులు సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీబీనగర్ నుంచి గుంటూరు వరకు ప్రస్తుతం ఉన్న రైలు మార్గంలోని కట్టలను అధికారులు పటిష్టపరిచడంతో ఈ మార్గంలోని రైళ్లు 130 కి.మీ వేగంతో ప్రయాణించవచ్చు. ఈ వేగం వందే భారత్ రైలు వేగానికి అనుకూలంగా ఉండడంతో పాటు దూరం తక్కువగా ఉండడంతో దీన్ని ఎంపిక చేసినట్లు సమాచారం.
సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్లేందుకు ప్రస్తుతం నారాయణాద్రి రైలు అందుబాటులో ఉంది. ఈ రైలు సికింద్రాబాద్- బీబీనగర్- నల్గొండ- మిర్యాలగూడ- నడికుడి- పిడుగురాళ్ల- సత్తెనపల్లి- గుంటూరు- తెనాలి- బాపట్ల- చీరాల- ఒంగోలు- సింగరాయకొండ- కావలి- నెల్లూరు- గూడూరు- వెంకటగిరి- శ్రీకాళహస్తి- రేణిగుంట- తిరుపతి వెలుతోంది. అయితే.. ఈ రైలులో సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వెళ్లేందుకు 12.30 గంటల సమయం పడుతోంది. దూరం 664 కిలోమీటర్లు.
దూరం తగ్గితే.. పెరగనున్న ఆదరణ
ఈ దూరాన్ని తగ్గించడంతో పాటు ప్రయాణ సమయాన్ని తగ్గిస్తే వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు ఆదరణ లభిస్తుందని అధికారులు బావిస్తున్నారు. ఇందుకోసం వందే భారత్ రైలును పిడుగురాళ్ల సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన న్యూపిడుగురాళ్ల జంక్షన్ నుంచి డైవర్ట్ చేయనున్నారు. ఈ జంక్షన్ నుంచి శావల్యపురం మీదుగా నేరుగా ఒంగోలు వరకు వెళ్లవచ్చు. అక్కడి నుంచి సింగరాయకొండ, కావలి, నెల్లూరు, గూడూరు, శ్రీకాళహస్తి, రేణిగుంట మీదుగా తిరుపతికి వెళ్లనుంది.
అయితే.. శావల్యపురం నుంచి ఒంగోలు మార్గం వరకు రెండు లైన్లు ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. ఈ పనులు పూరైతే సుమారు 150 కిలోమీటర్ల ప్రయాణ దూరం తగ్గుతుంది. గుంటూరు మార్గంలో రైలు నడిపితే దూరం పెరుగుతుండడంతో ఈ మార్గాన్ని ఎంపిక చేశారు. కేంద్ర ప్రభుత్వం వందే భారత్ రైళ్లు తయారు చేసి వాటిని తిరుపతి మార్గంలో కేటాయించే నాటికి ఈ మార్గంలో ఉన్న పనులు పూర్తి చేసేలా అధికారులు చర్యలు చేపట్టారు.
ఈ మార్గంపై అంతర్గతంగా ఇప్పటికే రైల్వే భద్రత అధికారులు పరిశీలన చేశారు. ఉన్నతాధికారుల నుంచి నిర్ణయం వెలువడాల్సి ఉందని ఓ రైల్వే అధికారి చెప్పారు.