Secunderabad cantonment: కాంగ్రెస్‌లో చేరిన బీజేపీ అభ్యర్థి

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే లాస్య నందిత అకాల మరణంతో అనివార్యమైన సికింద్రాబాద్ కంటోన్మెంట్ రాజకీయ పరిణామాల్లో రాజకీయాలు వేడెక్కాయి.

By అంజి  Published on  20 March 2024 5:49 AM GMT
Secunderabad Cantonment, Political, BJP Candidate,  Congress

Secunderabad cantonment: కాంగ్రెస్‌లో చేరిన బీజేపీ అభ్యర్థి

హైదరాబాద్: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే లాస్య నందిత అకాల మరణంతో అనివార్యమైన సికింద్రాబాద్ కంటోన్మెంట్ రాజకీయ పరిణామాల్లో రాజకీయాలు వేడెక్కాయి. డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన శ్రీగణేష్ నారాయణన్.. అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంగళవారం రాత్రి టికెట్‌ హామీ ఇవ్వడంతో ఆయన కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌కుమార్‌ నివాసంలో జరిగిన ఈ చేరిక కార్యక్రమానికి మైనంపల్లి హనుమంతరావు, మహేందర్‌రెడ్డి సహా ఇతర పార్టీ నేతలు హాజరయ్యారు. సీఎం రేవంత్‌రెడ్డి సూచనల మేరకు వారి సమక్షంలోనే శ్రీగణేష్‌ కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు.

కాంగ్రెస్‌లో చేరాలన్న తన నిర్ణయంపై శ్రీగణేష్ నారాయణన్ మాట్లాడుతూ.. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం అభివృద్ధి కోసమే తాను మారానని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లోనూ, కంటోన్మెంట్ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ తన సత్తాను చాటుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పట్నం మహేందర్‌రెడ్డి, మైనంపల్లి హనుమంతరావు సహా పార్టీ సీనియర్‌ నేతలు, మాజీ ఎమ్మెల్యేలతో రెండు రోజులుగా చర్చించిన అనంతరం కాంగ్రెస్‌లో చేరిక ఖరారైందని వెల్లడించారు. మంగళవారం మధ్యాహ్నం వరకు మల్కాజిగిరిలో ఈటల రాజేందర్‌తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన మంగళవారం మధ్యాహ్నం వరకు బీజేపీ తరపున ప్రచారం చేశారు. ఆయన హఠాత్తుగా పార్టీ మారడం బీజేపీ శ్రేణులను షాక్‌కు గురి చేసింది.

Next Story