Telangana: పెరుగుతున్న సీజనల్ వ్యాధులు.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
By అంజి Published on 28 Aug 2024 7:28 AM ISTTelangana: పెరుగుతున్న సీజనల్ వ్యాధులు.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. డెంగ్యూ, చికున్ గున్యా, వైరల్ జ్వరాలతో వివిధ ఆసుపత్రుల్లో పెరుగుతున్న కేసులపై ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాధులు ప్రబలకుండా తగిన నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, గ్రామాల్లో దోమల నిర్మూలనకు ఫాగింగ్, స్ప్రేయింగ్ ముమ్మరం చేయాలని ఆదేశించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో క్రమం తప్పకుండా ఫాగింగ్ జరిగేలా చూడాలని, ఎప్పటికప్పుడు అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి తనిఖీలు చేయాలని సీఎం ఆదేశించారు.
సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో పాటు సంబంధిత శాఖల అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం చేపట్టే చర్యల పట్ల ఉదాసీనంగా వ్యవహరించే ఉద్యోగులు, సిబ్బందిపై చర్యలు తప్పవని సీఎం హెచ్చరించారు. జీహెచ్ఎంసీ అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్ సమన్వయంతో పని చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అవసరమైతే పోలీసు విభాగం, స్వచ్ఛంద సంస్థలు, మీడియా సహకారం తీసుకొని సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి సూచించారు.
అన్ని జిల్లాల్లోనూ కలెక్టర్లు, పంచాయతీరాజ్ అధికారులు సీజనల్ వ్యాధులపై వెంటనే ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అన్ని జిల్లాల్లో కలెక్టర్లు క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలని, గ్రామాలు, పట్టణాలకు వెళ్లి పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని సూచించారు. డెంగ్యూ, చికున్ గున్యా కేసులు నమోదైన ప్రాంతాలకు వెళ్లి కారణాలను గుర్తించాలని, అవసరమైన పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.
అలాగే హైదరాబాద్‌లోని గోషామహల్‌లో ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కొత్త భవనాన్ని నిర్మించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అందుకోసం గోషా మహల్ పోలీస్ స్టేడియం, పోలీస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కలిపి దాదాపు 32 ఎకరాల స్థలాన్ని వెంటనే వైద్య ఆరోగ్య శాఖకు బదిలీ చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా ఎంచుకున్న స్పీడ్ (స్మార్ట్ ప్రోయాక్టివ్ ఎఫీషియెంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ) ప్రణాళికలో ఉన్న వివిధ అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రి సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.
స్పీడ్ జాబితాలో ఉన్న 19 పనుల్లో ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవన నిర్మాణం, 15 కొత్త నర్సింగ్ కాలేజీలు, 28 కొత్త పారా మెడికల్ కాలేజీలు, జిల్లాల్లో సమాఖ్య భవనాల నిర్మాణాలకు సంబంధించిన ప్రణాళికలను సీఎం చర్చించారు. రాబోయే 50 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా కొత్త ఆసుపత్రి నిర్మాణానికి అనుభజ్ఞులైన ఆర్కిటెక్టులతో డిజైన్లు రూపొందించాలని ఆదేశించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా అక్కడికి చేరుకునే కనెక్టింగ్ రోడ్లను అభివృద్ధి చేయాలని, ఆసుపత్రి చుట్టూ నలు దిశలా రోడ్డు ఉండేలా డిజైన్ చేయాలని చెప్పారు.
ఆసుపత్రికి అవసరమైన అన్ని విభాగాలతో పాటు అకడమిక్ బ్లాక్, నర్సింగ్ ఉద్యోగులకు హాస్టళ్లు కూడా నిర్మించేలా ప్రణాళికలు ఉండాలని చెప్పారు. కార్పొరేట్ తరహాలో వైద్య విభాగాలు, సేవలన్నీ అక్కడే అందుబాటులో ఉండాలని సూచించారు. ఇప్పుడున్న ఉస్మానియా హాస్పిటల్ భవనాలను చారిత్రక కట్టడాలుగా పరిరక్షించే బాధ్యతను చేపడుతామని సీఎం చెప్పారు. మూసీ రివర్ డెవెలప్‌మెంట్ ప్రాజెక్టులో భాగంగా అక్కడున్న భవనాలను పర్యాటకులను ఆకట్టుకునే చారిత్రక భవనాలుగా తీర్చిదిద్దుతామని అన్నారు.
గోషామహల్ స్థలాన్ని వైద్య ఆరోగ్య శాఖకు అప్పగించినందుకు పోలీసు విభాగానికి ప్రత్నామ్నాయ స్థలం కేటాయించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. పేట్లబుర్జులో ఉన్న పోలీస్ ట్రాన్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్, సిటీ పోలీస్ అకాడమీ, చుట్టూ ఉన్న స్థలాన్ని క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.