మధ్యాహ్న భోజనం కాదు.. బేకరీ ఫుడ్ వల్లే అస్వస్థత: కలెక్టర్
నారాయణపేట జిల్లా మాగనూరు జడ్పీ పాఠశాలలో మళ్లీ ఫుడ్ పాయిజన్ ఘటన చోటు చేసుకుంది. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత వాంతులు, విరేచనాలతో 21 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
By అంజి Published on 27 Nov 2024 8:00 AM ISTమధ్యాహ్న భోజనం కాదు.. బేకరీ ఫుడ్ వల్లే అస్వస్థత: కలెక్టర్
నారాయణపేట జిల్లా మాగనూరు జడ్పీ పాఠశాలలో మళ్లీ ఫుడ్ పాయిజన్ ఘటన చోటు చేసుకుంది. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత వాంతులు, విరేచనాలతో 21 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని మాగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మెరుగైన వైద్యం కోసం పలువురిని మక్తల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఇద్దరు విద్యార్థినుల పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని చికిత్స నిమిత్తం మహబూబ్‌నగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
తాజాగా ఈ ఘటనపై కలెక్టర్ సిక్తా పట్నాయక్ స్పందించారు. మధ్యాహ్న భోజనానికి ముందు 22 మంది విద్యార్థులు బేకరీలు, దుకాణాల్లో తినుబండారాలు తిన్నారని తెలిపారు. మధ్యాహ్న భోజనం వికటించి అస్వస్థతకు గురి కాలేదన్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులు క్షేమంగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ ఘటనపై విచారణ చేస్తున్నామని చెప్పారు.
నవంబర్ 20, 21 తేదీల్లో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనల నేపథ్యంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. దీంతో జిల్లా విద్యాశాఖాధికారితోపాటు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, మండల విద్యాశాఖాధికారిని సస్పెండ్ చేయడంతో పాటు ఆహార సామాగ్రిని సరఫరా చేసే ఏజెన్సీతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేశారు.
వరుస ఘటనలపై బీఆర్‌ఎస్ సీనియర్ నేత హరీష్ రావు మాట్లాడుతూ.. ''వంద మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ జరిగి, పది రోజులు కూడా గడవలేదు. మళ్ళీ మాగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజన్? 30 మంది విద్యార్థులు వాంతులు, కడుపు నొప్పితో మహబూబ్ నగర్ జిల్లా దవాఖానలో చేరిన దుస్థితి. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో వరుస ఫుడ్ పాయిజన్ కేసులు నమోదవుతున్నా, ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదు. తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా కనీస చర్యలకు ఉపక్రమించడం లేదు. విద్యార్థులకు కల్తీ ఆహారం పెడితే జైలుకు పంపిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి మాటలు నీటి మూటలే అయ్యాయి. మాటలే తప్ప చేతలు లేని సీఎం నిర్లక్ష్య తీరు వల్ల ఇంకెంత మంది విద్యార్థులు ఆస్పత్రి పాలు కావాలి, ఇంకెందరు ప్రాణాలు కోల్పోవాలి?'' అని ప్రశ్నించారు.