తెలంగాణలో ఫిబ్రవరి 1 నుండి మోగనున్న బడి గంట
Schools will reopen from February first in Telangana. తెలంగాణలో ఫిబ్రవరి 1 నుండి మోగనున్న బడి గంట.
By తోట వంశీ కుమార్
పలు అంశాలపై చర్చించేదుకు సోమవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్.. ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఆయన అనేక అంశాల గురించి చర్చించారు. ఈ సమావేశంలో మంత్రులు, కలెక్టర్లు, పంచాయతీ రాజ్, రెవెన్యూ, మున్సిపల్, వైద్యారోగ్య, విద్యాశాఖ, మున్సిపల్ శాఖ, అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు. ప్రధానంగా విద్యాసంస్థల ప్రారంభం పై ఆ శాఖ అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా జాగ్రత్తలు పాటిస్తూ విద్యాసంస్థల నిర్వహణ సాధ్యమేనని అధికారులు వెల్లడించడంతో.. విద్యాసంస్థల ప్రారంభానికి సీఎం పచ్చజెండా ఊపారు.
ఈ క్రమంలో ఫిబ్రవరి 1వ తేదీ నుండి 9వ తరగతి నుండి ఆపై తరగతులను నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. కరోనా మహమ్మారి కారణంగా గతేడాది విద్యాసంవత్సరం చాలా వరకు రద్దు అయ్యింది. ఆన్‌లైన్ ద్వారానే విద్యార్థులు క్లాసులకు హాజరవుతున్నారు. దీంతో ఆరోజు నుండి 9వ తరగతి నుండి ఆపై తరగతుల వారికి విద్యాసంస్థలు ఓపెన్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. పదో తరగతి పరీక్షలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ధరణి పోర్టల్‌లో అవసరమైన అన్నిరకాల మార్పులు, చేర్పులను వారం రోజుల్లోగా పూర్తి చేయాలన్నారు. కరోనా వ్యాక్సినేషన్ కోసం ఏర్పాట్లు వెంటనే పూర్తి చేయాలన్నారు. అడవుల పునరుద్ధరణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. అన్ని శాఖల్లో వెంటనే పదోన్నతులు ఇవ్వాలని, ఖాళీలన్నీ ఒకేసారి వెంటనే భర్తీ చేయాలని ఆదేశించారు. అన్ని పట్టణాల్లో జనాభాకు అనుగుణంగా సమీకృత మార్కెట్లు, వైకుంఠ ధామాలు నిర్మించాలని సీఎం ఆదేశించారు.