వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం సామిరెడ్డిపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా నిర్వహిస్తున్న క్రీడా పోటీల్లో పాల్గొన్న ఓ విద్యార్థి కుప్పకూలిపోయి చనిపోయాడు. పెద్దమందడి మండలం బలిజపల్లిలోని ఉన్నత పాఠశాలలో సీఎం కప్ పాఠశాల స్థాయి క్రీడా పోటీలను నిర్వహించారు. అదే స్కూల్‌లో చదువుతున్న పామిరెడ్డిపల్లితండాకు చెందిన 10వ తరగతి విద్యార్థి సాయిప్రణీత్ శనివారం వాలీబాల్ ఆడుతూ కిందపడిపోయాడు.
వెంటనే టీచర్ వారి సొంత వాహనంలో వనపర్తి ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. అయితే ఉదయం ఒకసారి కళ్లు తిరుగుతున్నాయని సాయి ప్రణీత్ చెప్పడంతో అతడి తల్లి లీలమ్మ.. వైద్యుడికి చూపించి స్కూల్‌కు పంపింది. ఈ క్రమంలో ఆటలు ఆడుతుండగా.. ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. విద్యార్థి మృతితో తండాలో విషాదఛాయలు అలముకున్నాయి.