దేశంలో ఎక్కడా లేనివిధంగా అత్యధిక సంఖ్యలో గురుకుల పాఠశాలలు రాష్ట్రంలో ఉన్నాయని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఒక్కో విద్యార్థిపై ఏడాదికి రూ.లక్షా 20 వేలు ఖర్చు చేస్తున్నామని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో పర్యటించిన మంత్రి... లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు అందజేశారు. గంభీరావుపేటలో రూ.2.25 కోట్లతో నూతనంగా నిర్మించిన డిగ్రీ కళాశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ప్రారంభించారు. ఈ కళాశాలను రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. విద్యార్థులు వృత్తి నైపుణ్య విద్యతోపాటు అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు.
విదేశాలకు వెళ్లి చదువుకునే వారికీ ఒక్కో విద్యార్థికి రూ.20 లక్షల చొప్పున ఉపకార వేతనాలు అందజేస్తున్నాం. 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామని సీఎం చెప్పారు. ప్రైవేట్ రంగంలో పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు మెరుగుపరిచాం. స్కిల్, రీస్కిల్, అప్‌స్కిల్.. పాటిస్తే ఉద్యోగ అవకాశాలు వస్తాయి అని కేటీఆర్ తెలిపారు.