ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించిన కాంగ్రెస్
పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో
By Medi Samrat Published on 26 Aug 2023 9:35 PM ISTపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో చేవెళ్ల సభలో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించారు. జనాభా దామాషా ప్రకారం ఎస్సీల రిజర్వేషన్లు 18% కి పెంచుతామని హామీ ఇచ్చారు. ఎస్సీల చిరకాల డిమాండ్ ఏ,బి, సి,డి వర్గీకరణ అమలుకై కృషి చేస్తామని ఖర్గే ప్రకటించారు. అంబేద్కర్ అభయ హస్తం పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ.12 లక్షల ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించారు. దళిత, గిరిజనుల విద్య, ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకై ప్రత్యేక పథకాలు తీసుకొస్తామన్నారు.
సమ్మక్క, సారక్క గిరిజన గ్రామీణాభివృద్ధి పథకం ద్వారా ప్రతి గూడెం, తండా, గ్రామ పంచాయితీకి రూ. 25 లక్షల నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ ప్రొక్యూర్ మెంట్ మరియు అన్ని కాంట్రాక్టులలో ఎస్సీలకు 18%, ఎస్టీలకు 12% రిజర్వేషన్లు కల్పిస్తామని పేర్కొన్నారు. ప్రైవేటు విద్యా సంస్థలలో, ప్రభుత్వ ప్రోత్సాహకాలను పొందే ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్ల కల్పన చేస్తామని హామీ ఇచ్చారు.
ఇళ్లు లేని ఎస్సీ, ఎస్టీ కుటుంబానికి ఇంటి స్థలంలో పాటు, ఇంటి నిర్మాణానికి రూ.6 లక్షలు అందజేస్తామని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గుంజుకున్న ఎస్సీ, ఎస్టీల అసైన్డ్ భూములను తిరిగి అసైనీలకే అన్ని హక్కులతో పునరుద్ధరణ చేయడంతో పాటు.. అసైన్డ్ భూములకు పట్టా భూములతో సమానంగా పరిహారం చెల్లిస్తామని పేర్కొన్నారు.
ఎస్సీ కార్పొరేషన్లకు ప్రతి ఏడాది రూ.750 కోట్లు.. ఎస్టీ కార్పొరేషన్లకు ప్రతి ఏడాది రూ.500 కోట్లు నిధులు విడుదల చేయనున్నట్లు తెలిపారు.
నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం, నిజామాబాద్, మహబూబా బాద్ లో 5 కొత్త ఐటీడీఏలు – ఐటీడీఏలలో 9 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
విద్యా జ్యోతులు పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు పదవ తరగతి పాసైతే రూ.10,000, ఇంటర్ పాసైతే రూ.15,000, గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తే రూ.25,000, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తే రూ. లక్ష, ఎంఫిల్, పీహెచ్ డీ పూర్తి చేసిన ఎస్సీ, ఎస్టీ యువతకు రూ.5 లక్షలు అందజేస్తామని పేర్కొన్నారు. విదేశాల్లోని యూనివర్సిటీల్లో ప్రవేశం పొందిన ప్రతి ఎస్సీ, ఎస్టీ విద్యార్థికి ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు వెల్లడించారు.