కాళేశ్వరంలో నేటితో ముగియనున్న సరస్వతీ పుష్కరాలు
కాళేశ్వరంలో సరస్వతీ పుష్కరాలు నేటితో ముగియనున్నాయి.
By Knakam Karthik
కాళేశ్వరంలో నేటితో ముగియనున్న సరస్వతీ పుష్కరాలు
కాళేశ్వరంలో సరస్వతీ పుష్కరాలు నేటితో ముగియనున్నాయి. ఆదివారం భక్తులు భారీగా తరలివచ్చారు. 3.50 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు అధికారులు వెల్లడించారు. కాగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సతీ సమేతంగా పుష్కరాలకు హాజరయ్యారు. ఇవాళ సోమవారం కావడంతో భక్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. కాళేశ్వరం వెళ్లే రూట్‌లో భారీ ట్రాఫిక్ జామ్ కావడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
మహదేవపూర్ నుంచి కాళేశ్వరం వరకు దాదాపు 15కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. దీనికి తోడు ప్రైవేటు వాహనాలను ప్రధాన రహదారి నుంచి ఆలయం వరకు, పుష్కర ఘాట్ల వరకు అనుమతించడం సమస్య తీవ్రతను మరింత పెంచింది. చాలామంది భక్తులు మహారాష్ట్ర వైపు పుణ్యస్నానాలు చేసి శివుడిని దర్శించుకోకుండానే తిరిగి వెళ్లిపోయారు. కాళేశ్వర ముక్తీశ్వర ఆలయంలో వీఐపీల సేవలో తరించిన అధికారులు.. సామాన్యులను పట్టించుకోకపోవడం విమర్శలకు దారి తీసింది. ట్రాఫిక్ నియంత్రణలో వైఫల్యంపై మంత్రి శ్రీధర్‌బాబు జిల్లా ఎస్పీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు