సరస్వతి పుష్కరాలు ప్రారంభం..12 రోజుల పాటు కొనసాగనున్న మహాక్రతువు
కాళేశ్వర క్షేత్రం త్రివేణి సంగమంలో సరస్వతి నది పుష్కరాలు నేటి నుంచి ప్రారంభం అయ్యాయి
By Knakam Karthik
సరస్వతి పుష్కరాలు ప్రారంభం..12 రోజుల పాటు కొనసాగనున్న మహాక్రతువు
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వర క్షేత్రం త్రివేణి సంగమంలో సరస్వతి నది పుష్కరాలు నేటి నుంచి ప్రారంభం అయ్యాయి. గురువారం వేకువజామున 5.44 గంటలకు శ్రీ గురు మదనానంద సరస్వతి పీఠాధిపతి మాధవానంద సరస్వతి సరస్వతి ఘాట్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి పుష్కరాలను లాంఛనంగా ప్రారంభించారు. పుష్కరాల సందర్భంగా కాళేశ్వరంలోని ముక్తీశ్వర క్షేత్రాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ప్రతిరోజు సరస్వతి ఘాట్ వద్ద సాయంత్రం 6.45 నుంచి 7.35 గంటల వరకు సరస్వతి నవరత్న మాల హారతి ఉంటుంది.
గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2013లో చివరిసారిగా సరస్వతి నది పుష్కరాలు జరిగాయి.. తెలంగాణ ఏర్పాటు తర్వాత మొదటి సారి ఈ పుష్కరాలు జరుగుతున్నాయి. గోదావరి, ప్రాణహిత నదులతో పాటు సరస్వతి నది కూడా అంతర్వాహినిగా కలిసే ఈ పవిత్ర స్థలంలో ఈ నెల 26 వరకు ఈ మహాక్రతువు కొనసాగుతుంది. 12 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించడంతో సరస్వతి నదికి పుష్కరాలు వచ్చాయి.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గురువారం సాయంత్రం 4 గంటలకు కాళేశ్వరం వస్తారు. త్రివేణి సంగమం వద్ద ఏర్పాటు చేసిన సరస్వతి ఘాట్‌ను ఆయన ప్రారంభించనున్నారు. అలాగే అక్కడ ఏర్పాటు చేసిన సరస్వతి దేవి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం నదిలో స్నానం చేసి కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో దర్శనం చేసుకుంటారు. సాయంత్రం 5.30 గంటలకు సరస్వతి ఘాట్‌లో నిర్వహించే నదీ హారతిలో ఆయన పాల్గొంటారు.