ఇప్పుడు జనాల్లో సీఎం రేవంత్ రెడ్డి, అల్లు అర్జున్ గురించే చర్చ జరుగుతోంది. సంధ్య థియేటర్ తొక్కిసలాటను ప్రస్తావిస్తూ అల్లు అర్జున్‌పై సీఎం రేవంత్ నిన్న అసెంబ్లీలో ఫైర్ అయ్యారు. దీనిపై వెంటనే స్పందించిన అల్లు అర్జున్ ప్రెస్‌మీట్ పెడుతున్నట్టు ప్రకటించారు. రాత్రి 8 గంటలకు మీడియా ముందుకు వచ్చిన అల్లు అర్జున్.. సీఎం వ్యాఖ్యలు సరికాదన్నారు. దీంతో కాంగ్రెస్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ వారి వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు.
నిన్న అసెంబ్లీలో అల్లు అర్జున్‌ను పరామర్శించిన సినీ సెలబ్రిటీలపై సీఎం రేవంత్ మండిపడ్డారు. 'ఓ బాలుడు 15 రోజులుగా ఆస్పత్రిలో పోరాడుతుంటే వీళ్లెవరైనా పరామర్శించారా? ఒక్కపూట జైలుకు వెళ్లిన హీరోను మాత్రం కాళ్లు చేతులు పోయిన మనిషిని చూడటానికి వెళ్లినట్టు వెళ్లారు. అక్కడేమైనా కాలు పోయిందా? కన్ను పోయిందా? చేయి పోయిందా? కానీ ఆస్పత్రిలో ఓ ప్రాణం పోయింది. తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందే'' అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.
అటు సీఎం రేవంత్ వ్యాఖ్యలు బాధ కలిగించాయని అల్లు అర్జున్ అన్నారు. రోడ్ షో చేశామని చెప్పడం సరికాదని వివరించారు. అనుమతి లేకుండా వెళ్లామనేది తప్పుడు ఆరోపణ అని చెప్పారు. తొక్కిసలాట గురించి మరుసటి రోజు తెలిసిందని వివరించారు. ప్రభుత్వంతో తాను ఎలాంటి వివాదం కోరుకోవడం లేదని చెప్పారు. సినిమా పెద్ద హిట్ అయినా 15 రోజులుగా ఇంట్లో నుంచి బయటకు వెళ్లలేకపోతున్నానని పేర్కొన్నారు.