తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ఎండీగా శుక్రవారం సైబరాబాద్ మాజీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ బాధ్యతలు చేపట్టారు. ఆర్టీసీ ప్రధాన కార్యాలయం బస్ భవన్‌లో వేద పండితుల ఆశీర్వచనాల మధ్య బాధ్యతలు చేపట్టారు. వారం రోజుల క్రితం సజ్జనార్‌ను ఆర్టీసీ ఎండీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో సైబరాబాద్ సీపీగా స్టీఫెన్ రవీంద్రను నియమించింది.
ఇప్పటివరకు ఆర్టీసీ ఎండీగా రవాణ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సునీల్ శర్మ కొనసాగారు. అయితే ఐపీఎస్ ఆఫీసర్‌ను ఆర్టీసీ ఎండీ నియమించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో సైబరాబాద్ సీపీగా ఉన్న సజ్జనార్ ఆర్టీసీ ఎండీగా నియమితులయ్యారు. మూడేళ్ల పాటు సైబరాబాద్ సీపీగా పని చేసిన సజ్జనార్ నేరాల కట్టడికి కఠిన చర్యలు తీసుకున్నారు. 2009లో సంచలనం సృష్టించిన దిశ కేసులో సజ్జనార్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సజ్జనార్ గతంలో సీఐడీ, ఇంటిలిజెన్స్ విభాగాలలో పనిచేశారు.