తెలంగాణలో భారీగా పెరిగిన చికెన్ ధరలు
Russia-Ukraine war triggers rise in chicken prices in Telangana. తెలంగాణ రాష్ట్రంలో చికెన్ ధరలు మండిపోతున్నాయి. కొందరికి రోజు ముక్క తినందే.. ముద్ద దిగదు. చికెన్ ధరలు చూసి మాంసం
By అంజి
తెలంగాణ రాష్ట్రంలో చికెన్ ధరలు మండిపోతున్నాయి. కొందరికి రోజు ముక్క తినందే.. ముద్ద దిగదు. చికెన్ ధరలు చూసి మాంసం ప్రియులు షాక్‌కు గురవుతున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి పరోక్షంగా రాష్ట్రంలో చికెన్ ధరలు పెరగడానికి కారణమైంది. ఒక కిలో చికెన్ మాంసం రూ. 280కి అమ్ముడవుతోంది. అదే గత నెలలో కిలో రూ.180 ధర పలికింది. దేశవ్యాప్తంగా కోళ్ల దాణా ధరలు పెరగడం కూడా ధర పెరగడానికి ఒక కారణమని కోళ్ల పెంపకందారులు చెబుతున్నారు. మొక్కజొన్న, సోయాబీన్ ఎక్కువగా ఫీడ్‌లో భాగంగా ఉంటాయి. కొన్ని వారాల క్రితం రూ. 40 ఉన్న కిలో సోయాబీన్ ఇప్పుడు రూ. 70కి చేరుకోగా, మొక్కజొన్న కిలో ధర రూ. 20 ఉండగా ఇప్పుడు రూ. 27 పలుకుతోంది, ఇంకా కిలో రూ. 30కి పెరుగుతుందని అంచనా.
"ఉక్రెయిన్‌లో యుద్ధం నేపథ్యంలో విపరీతమైన గిరాకీని అనుసరించి, తమ ఉత్పత్తులను స్థానికంగా సరఫరా చేసిన భారతదేశానికి చెందిన రైతులు ఇప్పుడు ఇతర దేశాలకు మొక్కజొన్న, సోయాబీన్‌లను ఎగుమతి చేస్తున్నారు. వాస్తవానికి సోయాబీన్, మొక్కజొన్నలను అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశాల్లో ఉక్రెయిన్ ఒకటి. అక్కడ కొనసాగుతున్న సంక్షోభం కారణంగా ఆ దేశం నుండి ఎగుమతులు దెబ్బతిన్నాయి. వేసవిని దృష్టిలో ఉంచుకుని వచ్చే కొన్ని నెలల పాటు ప్రస్తుత పరిస్థితి కొనసాగుతుందని కోళ్ల పెంపకందారుల సంఘం అభిప్రాయపడింది.
"వేసవిలో కోళ్ల మరణాలు ఎక్కువగా ఉంటాయి. ఇది కాకుండా, మహమ్మారి, లాక్‌డౌన్ల కారణంగా భారీ నష్టం జరిగింది. ప్రస్తుతం కోళ్ల దాణా ధరలు పెరగడం కూడా ధరల పెరుగుదలకు దోహదపడుతోంది'' అని తెలంగాణ పౌల్ట్రీ బ్రీడర్స్ అసోసియేషన్ సభ్యుడు ఒకరు తెలిపారు. ధరల పెరుగుదల నగరంలోని హోటళ్ల వ్యాపారులను కూడా దెబ్బతీసింది. "మేము లాభ-నష్టం లేకుండా చికెన్ వంటకాలను సిద్ధం చేసి పంపిణీ చేస్తున్నాము. కొన్ని హోటళ్లు తమ చైనీస్ ఫాస్ట్‌ఫుడ్ అవుట్‌లెట్‌లను కూడా మూసివేసాయి" అని టోలిచౌకిలోని షా ఘౌస్ హోటల్ యజమాని మొహమ్మద్ ఇర్ఫాన్ అన్నారు.