Telangana: సర్పంచ్‌ల ఎన్నికలకు ఈసీ కసరత్తు

తెలంగాణలో సర్పంచ్‌ల పదవీ కాలం త్వరలోనే ముగియనుంది.

By Srikanth Gundamalla  Published on  7 Dec 2023 1:39 AM GMT
Gram Panchayat, elections, EC, telangana ,

Telangana: సర్పంచ్‌ల ఎన్నికలకు ఈసీ కసరత్తు

తెలంగాణలో సర్పంచ్‌ల పదవీ కాలం త్వరలోనే ముగియనుంది. 2024 ఫిబ్రవరి 1తో సర్పంచ్‌ల పదవీ కాలం ముగుస్తుంది. అంటే మరో 55 రోజుల గడువు మాత్రమే ఉంది. ఈ క్రమంలో తెలంగాణలోని 12,769 గ్రామ పంచాయతీల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది.

ఈ మేరకు సర్పంచ్‌లు, వార్డు సభ్యల రిజర్వేషన్ల వివరాల కోసం జిల్లాల వారీగా నివేదికలు సిద్ధం చేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శ ఎం.అశోక్‌ కుమార్ అన్ని జిల్లాల కలెక్టర్లకు లేఖలు పంపారు. ఓటర్ల సంఖ్య ఆధారంగా గ్రామాల్లో పోలింగ్ స్టేషన్ల ఎంపిక, పోలింగ్‌ సిబ్బంది రాండమైజేషన్‌ సిస్టమ్ సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్‌లో వివరాల నమోదు వంటి వాటిపై జిల్లాల కలెక్టర్లకు అశోక్‌ కుమార్‌ పలు సూచనలు చేశారు. అయితే.. ఈ ప్రక్రియ అంతా డిసెంబర్ 30వ తేదీలోపు పూర్తి చేయాలని ఆయన రాసిన లేఖల్లో పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసి కొద్దిరోజులే అవుతున్నాయి. ఇంకా ప్రభుత్వం కూడా పూర్తిస్థాయిలో ఏర్పాటే కాలేదు. అప్పుడే పంచాయతీ ఎన్నికలకు ఎన్నికల సంఘం కసరత్తులు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సర్వత్రా ఆసక్తి కొనసాగుతోంది.

కాగా.. పంచాయతీ ఎన్నికల కోసం ముందస్తు ఏర్పాట్లు మాత్రమే చేస్తున్నామని.. ఎన్నికలు ఇప్పుడు నిర్వహించాలనేది కొత్తగా ఏర్పడే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఎన్నికల సంఘం అధికారి ఒకరు వెల్లడించారు. మరోవైపు మార్చి, ఏప్రిల్‌ నెలలోనే పార్లమెంట్‌ ఎన్నికలు జరగాల్సి ఉంటుంది. దీన్ని బట్టి గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్ణీత సమయం అంటే జనవరి, ఫిబ్రవరిలో జరగకపోవచ్చే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పంచాయతీ ఎన్నికలు జూన్‌లో చేపట్టే అవకాశాలు ఉన్నాయని సమాచారం. అయితే.. పంచాయతీ ఎన్నికల నిర్వహణ నిర్ణయం పూర్తిగా కొత్తగా ఏర్పడే రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది కాబట్టి.. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేదానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రభుత్వం నిర్ణయం కోసం గ్రామీణ ప్రజాప్రతినిధులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తెలంగాణలో గత మూడున్నరేళ్లలో 6,117 సర్పంచ్‌, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఉపసర్పంచ్‌, వార్డు సభ్యుల పోస్టులు ఖాళీ అయ్యాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం వీటి ఉపఎన్నికలకు మొగ్గు చూపలేదు. దాంతో.. ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి ఆగిపోయిందంటూ పలువురు చెబుతున్నారు. సర్పంచ్‌లు, ఎంపీటీసీలు లేకపోవడంతో వారి సమస్యలు ఎవరికి చెప్పాలో కూడా అర్థం కావడం లేదంటూ ఆయా గ్రామాల ప్రజలు అంటున్నారు. మరి ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Next Story