దుబ్బాక విజయం బీజేపీకి ఎలా సాధ్యమైంది...? ఈ సమాచారమే రఘునందన్‌కు బ్రహ్మస్త్రం

RTI assistance in Dubbaka elections .. దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ విజయం ఎలా సాధ్యమైంది..? దీనిపై ఎవరి అంచనాలు ఎలా

By సుభాష్  Published on  19 Nov 2020 4:30 AM GMT
దుబ్బాక విజయం బీజేపీకి ఎలా సాధ్యమైంది...? ఈ సమాచారమే రఘునందన్‌కు బ్రహ్మస్త్రం

ఉప ఎన్నికలో ఆర్టీఐని బ్రహ్మస్త్రంగా ఉపయోగించుకున్నబీజేపీ

♦ 700కపైగా ఆర్టీఐ దరఖాస్తులు సమర్పించిన రఘునందన్‌రావు

♦ దుబ్బాక నిధుల వివరాలు సమాచార హక్కు చట్టం ద్వారా సేకరణ

♦ బీజేపీ గెలుపునకు ఆర్టీఐ చట్టం ఉపయోగం

దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ విజయం ఎలా సాధ్యమైంది..? దీనిపై ఎవరి అంచనాలు ఎలా ఉన్నా..ఉప ఎన్నికల్లో సమాచార హక్కు చట్టం కీలక పాత్ర పోషించిందని తెలుస్తోంది. సామాన్యుల చేతిలో అస్ర్తంగా పేరొందిన ఈ చట్టాన్ని బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు బ్రహ్మస్త్రంగా ఉపయోగించి విజయాన్ని సాధించారు. స్థానిక సంస్థలకు నిధులు కొరత లేదని పదేపదే చెబుతున్న సీఎం కేసీఆర్‌ వాస్తవానికి గ్రామ పంచాయతీలకు కేటాయించిన నిధులెన్ని..? దుబ్బాక నియోజకవర్గంలో వివిధ సంక్షేమ పథకాలు ఎవరికి అందుతున్నాయి..? రాష్ట్ర అభివృద్ధి పనులకు కేటాయించిన కోట్లాది నిధులు ఎలా దుర్వినియోగం అయ్యాయి? సీఎం కేసీఆర్‌, ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు తమ నియోజకవర్గాలకు కేటాయించింది ఎంత.? దుబ్బాక నియోజకవర్గానికి అందించిన నిధులెన్ని..? ఈ వివరాలన్నీ 'సమాచార హక్కు చట్టం' ద్వారా సేకరించిన రఘునందన్‌రావు వాటిని ప్రజల ముందుకు తీసుకెళ్లారు. ఈ వివరాలను మీడియా, సామాజిక మాధ్యమాల ద్వారా అందరికి తెలిసేలా చేశారు. దీని ద్వారా దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ గెలుపొందేందుకు ఎందో దోహదపడిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

దుబ్బాకలో ఒక మున్సిపాలిటీ, 7 మండలాలు, 1118 గ్రామ పంచాయతీలుండగా, వీటి పరిధిలోని 50 ప్రభుత్వ శాఖల్లో సమాచారం కోసం 700కుపైగా దరఖాస్తులు సమర్పించి సమాచారాన్ని పొందారు. అలాగే స్థానిక సంస్థలకు కేంద్రం నిధులివ్వడం లేదని టీఆర్‌ఎస్‌ నేతలు ప్రచారంలో ఆరోపించగా, గత ఆరేళ్లలో కేంద్రం విడుదల చేసిన నిధులను పంచాయతీలవారీగా సేకరించి ప్రజలకు చేరువయ్యేలా చేశారు. దుబ్బాక మున్సిపాలిటీ టౌన్‌ హాల్‌ నిర్మాణానికి ప్రభుత్వం రూ.3 కోట్లు విడుదల చేయగా, కేవలం పునాది వేసి వదిలేసినా సంబంధిత కాంట్రాక్టర్కు నిధులన్నీ విడుదల చేశారు. డంపింగ్‌ యార్డుకు రూ.2 కోట్లు కేటాయించగా, కనీసం పునాదులకు ముగ్గు కూడా పోయకుండానే నిధులన్నీ విడుదల చేసేశారు. పల్లెప్రగతి కింద ప్రతినెల గ్రామ పంచాయతీలకు ప్రత్యేక నిధులు కేటాయిస్తానని గతంలో సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు. దుబ్బాకలోని 118 గ్రామ పంచాయతీల్లో సఅలు నిధులే విడుదల చేయలేదన్న విషయాన్ని రఘునందన్‌రావు సేకరించారు. ముఖ్యమంత్రి దుబ్బాక నియోజకవర్గం గజ్వేల్‌కు స్పెషల్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ కింద గత ఆరేళ్లలో రూ.420 కోట్లు కేటాయించగా, సిద్దిపేట నియోజకవర్గానికి రూ.180 కోట్లు ఇచ్చారు. దుబ్బాకకు కేటాయించిన రూ.10 కోట్లే. ఈ విషయాన్నిబీజేపీ విస్తృతంగా ప్రచారం చేసింది. ఇలా సమాచార హక్కు చట్టం ద్వారా పొందిన వివరాలన్నీ ఉప ఎన్నిక ప్రచారంలో ప్రజలకు తెలియజేశారు. అంతేకాకుండా సోషల్‌ మీడియా ద్వారా ప్రజలకు తెలిసేలా ప్లాన్‌ చేసింది బీజేపీ. దీనినే బీజేపీ బ్రహ్మస్త్రంగా ఉపయోగించుకుని ప్రచారంలో దూసుకెళ్లింది. దీంతో బీజేపీ విజయానికి ఎంతో దోహదపడిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Next Story
Share it