ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ.. కండక్టర్ మృతి, 8 మందికి గాయాలు

RTC conductor dies in road accident in Jagtial. జగిత్యాల జిల్లా కొండగట్టు సమీపంలోని దొంగలమర్రి వద్ద ప్రమాదం జరిగింది.

By అంజి  Published on  15 Feb 2023 11:14 AM IST
ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ.. కండక్టర్ మృతి, 8 మందికి గాయాలు

జగిత్యాల జిల్లా కొండగట్టు సమీపంలోని దొంగలమర్రి వద్ద ప్రమాదం జరిగింది. బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో టీఎస్‌ఆర్‌టీసీ బస్సు కండక్టర్‌ మృతి చెందగా, ఐదుగురు ప్రయాణికులు గాయపడ్డారు. దొంగలమర్రి వద్ద ఆర్టీసీ బస్సును ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. ఘటన సమయంలో జగిత్యాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వరంగల్ వైపు వెళుతోంది. ఈ క్రమంలోనే ఎదురుగా వచ్చిన లారీ ఢీకొనడంతో బస్సు బోల్తా పడింది. ప్రమాదం జరగడాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కండక్టర్ అక్కడికక్కడే మృతి చెందగా, బస్సులో ప్రయాణిస్తున్న 8 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన ప్రయాణికులను జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కండక్టర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం ఇవాళ తెల్లవారుజామున 4 నుంచి 5 గంటల మధ్య జరిగింది. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. లారీ డ్రైవర్ మద్యం సేవించి లారీ నడిపడా.. లేక బస్సు డ్రైవర్ నిద్ర మత్తులో ఉన్నాడ అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Next Story