తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు ట్రావెల్స్ బస్సు లలో రవాణ శాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. జిల్లాల్లోని పలు కీలక ప్రాంతాలలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులలో ఆర్టిఏ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. నిబంధనలకు విరుద్దంగా నడుస్తున్న బస్సులపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. మహబూబ్‌నగర్, నల్గొండ, కోదాడ, కామారెడ్డి, నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాల తో పాటు హైదరాబాద్ శివారు ప్రాంతాలలో అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. శంషాబాద్, వనస్థలిపురం, గగన్ పహాడ్, అల్విన్ చౌరస్తా, ముంబై హైవేలపై తనిఖీలు నిర్వహించారు.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ గగన్‌పహాడ్ వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై బండ్లగుడా ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను గుర్తించారు. నిన్న కర్నూల్ జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దుర్ఘటన నేపథ్యంలో బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రతి ప్రైవేట్ బస్సును తనిఖీలు నిర్వహించారు. సరైన నిబంధనలు పాటించని బస్సులపై ఆర్టీఏ అధికారులు కేసులు నమోదు చేశారు. వనస్థలిపురం వద్ద ట్రావెల్స్ బస్సుల తనిఖీలు చేపట్టగా నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న నాలుగు బస్సులపై ఆర్టీఏ అధికారులు కేసులు నమోదు చేశారు. బస్టర్ ట్రావెల్స్‌కు చెందిన బస్సును సీజ్ చేశారు.