బీఆర్‌ఎస్‌ నాకిచ్చిన బాధ్యతను విజయవంతంగా నిర్వహించలేకపోయా: ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌

తనను నమ్మి నాగర్ కర్నూల్ పార్లమెంటు స్థానాన్ని కేటాయించిన బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్‌కు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ ధన్యవాదాలు తెలియజేశారు.

By అంజి  Published on  4 Jun 2024 4:30 PM GMT
RS Praveen Kumar, Nagar Kurnool, Telangana

బీఆర్‌ఎస్‌ నాకిచ్చిన బాధ్యతను విజయవంతంగా నిర్వహించలేకపోయా: ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌

తనను నమ్మి నాగర్ కర్నూల్ పార్లమెంటు స్థానాన్ని కేటాయించిన బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. పార్టీ అగ్ర నాయకత్వం తనకిచ్చిన బాధ్యతను విజయవంతంగా నిర్వహించలేకపోయానన్న నిరాశ కొంత ఉన్నా, విశాలమైన బీఆర్‌ఎస్ కుటుంబంలో ఒక సభ్యుడినైనందుకు గర్వంగా ఉందన్నారు.

ఈ ఎన్నికల ప్రచార సమయంలో వ్యయప్రయాసలకు ఓర్చుకొని అధికార పార్టీ ప్రతికూల చర్యలకు లొంగకుండా, దాడులకు బెదరకుండా పార్టీనే నమ్ముకొని తనను జనంలోకి నడిపించిన వనపర్తి మాజీ ఎమ్మెల్యే సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డి, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే డా.గువ్వల బాలరాజు, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ , కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డిలకు ప్రవీణ్‌ కుమార్‌ కృతజ్ఞతలు తెలిపారు.

అదే విధంగా జెండా మోసిన ప్రతి కార్యకర్తకు, పార్టీ నాయకులకు, సమన్వయకర్తలకు, సోషల్ మీడియా వారియర్స్ కు, స్వేరోలకు, ఆరెస్పీ అభిమానులకు ముఖ్యంగా ఈ పార్లమెంటు ఎన్నికల్లో ఈ నడిగడ్డ మట్టి బిడ్డను విశ్వసించి ఆదరించి 3,21,343 అమూల్యమైన ఓట్లతో ఆశీర్వదించిన ప్రతి ఓటరు మహాశయునికి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ పాదాభివందనం చేశారు. ప్రజల ఋణం తీర్చుకోవడానికి వచ్చే ఏ అవకాశాన్ని వదలనని ప్రమాణం చేశారు. నాగర్ కర్నూలు పార్లమెంటు సభ్యులుగా నేడు ఎన్నికైన డా. మల్లు రవి గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

Next Story