భారంగా పార్కింగ్ ఫీజు.. భక్తుల అసహనం

Rs 500 per hour parking fee at Yadagirigutta.ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్రం యాదాద్రి శ్రీల‌క్ష్మీ న‌ర‌సింహ‌స్వామి ఆల‌యాన్ని

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 May 2022 3:08 AM GMT
భారంగా పార్కింగ్ ఫీజు.. భక్తుల అసహనం

ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్రం యాదాద్రి శ్రీల‌క్ష్మీ న‌ర‌సింహ‌స్వామి ఆల‌యాన్ని తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించింది. యాదాద్రి ఆలయం పునః ప్రారంభోత్సవ వేడుక ఇటీవల వైభవంగా జరిగింది. స్వామి వారిని ద‌ర్శించుకునేందుకు భ‌క్తులు పెద్ద ఎత్తున త‌ర‌లివ‌స్తున్నారు. ఇదే అదునుగా ఆల‌య క‌మిటీ.. గుట్ట‌పై వాహ‌నాల పార్కింగ్ పేరుతో భ‌క్తుల‌ను నిలువు దోపిడి చేసేందుకు సిద్ద‌మైంది.

ప్రైవేటు వాహనాల పార్కింగ్‌ రుసుము మొదటి గంటకు రూ.500, ఆ తర్వాత ప్రతి గంటకూ అదనంగా మరో రూ.100 చొప్పున వసూలు చేయాలని ఆలయ అధికారులు నిర్ణ‌యించారు. నేటి(ఆదివారం) నుంచే పార్కింగ్ వసూలు మొదలుకానుంది. కాగా.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, అధికారులు, న్యాయమూర్తుల వాహనాలకు ప్రొటోకాల్‌ ప్రకారం ప్రవేశ రుసుం మినహాయింపు ఇచ్చారు. అలాగే.. దేవస్థానానికి భారీ విరాళాలు అందజేసే దాతల వాహనాలకు పార్కింగ్ రుసుం లేదు.

కాగా.. దీనిపై భ‌క్తులు మండిప‌డుతున్నారు. దైవ దర్శనం కోసం దూర ప్రాంతాల నుంచి వాహనాల్లో వచ్చే భక్తులను పార్కింగ్ పేరుతో నిలువుదోపిడీ చేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. కొండపైకి భక్తులను ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా చేరవేస్తున్నారు. అందుకయ్యే వ్యయాన్ని దేవస్థానం భరిస్తోంది. దర్శనాలను పునః ప్రారంభించిన తర్వాత కొండపైకి ప్రైవేట్‌ వాహనాలను అనుమతించకపోవడం వివాదాస్పదమైంది. ఆలయ అధికారుల తీరును స్థానికులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దాంతో.. ఉన్నతాధికారులు శనివారం సమీక్ష నిర్వహించారు. మే ఒకటో తేదీ నుంచి కొండపైకి ప్రైవేట్‌ వాహనాలను అనుమతించాలని నిర్ణయం తీసుకున్నారు. పార్కింగ్ ఫీజుతో భారీ వ‌డ్డ‌న‌కు సిద్ద‌మ‌య్యారు.


Next Story