తెలంగాణలో త్వరలో రోహిత్ వేముల చట్టం తెస్తాం: డీప్యూటీ సీఎం భట్టి

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శనివారం, జనవరి 17న మాట్లాడుతూ, రాష్ట్రంలో రోహిత్ వేముల చట్టాన్ని వీలైనంత త్వరగా ప్రవేశపెడతామని..

By -  అంజి
Published on : 18 Jan 2026 10:01 AM IST

Rohith Vemula Act, Telangana, Dy CM Bhatti, Telangana

తెలంగాణలో త్వరలో రోహిత్ వేముల చట్టం తెస్తాం: డిప్యూటీ సీఎం భట్టి

హైదరాబాద్: తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శనివారం, జనవరి 17న మాట్లాడుతూ, రాష్ట్రంలో రోహిత్ వేముల చట్టాన్ని వీలైనంత త్వరగా ప్రవేశపెడతామని అన్నారు. అంతకుముందు రోజు, పరిశోధనా విద్యార్థి రోహిత్ వేముల 10వ వర్ధంతిని పురస్కరించుకుని హైదరాబాద్ విశ్వవిద్యాలయం (UoH) విద్యార్థుల బృందం తరగతులను బహిష్కరించి వర్సిటీ క్యాంపస్‌లో కవాతు నిర్వహించింది. జనవరి 17, 2016న యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ క్యాంపస్‌లోని హాస్టల్ గదిలో వేముల ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతని ఆత్మహత్య దేశాన్ని నిరసనలతో కుదిపేసింది.

ప్రజాభవన్‌లో జస్టిస్‌ ఫర్‌ రోహిత్‌ వేముల ప్రచార కమిటీ సభ్యులను కలిసిన విక్రమార్క.. రాష్ట్రంలో రోహిత్‌ వేముల చట్టాన్ని తీసుకురావాలని కోరుతూ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి లేఖ కూడా రాసిన విషయాన్ని గుర్తు చేశారు. కర్ణాటక, తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు వీలైనంత త్వరగా చట్టాన్ని అమలు చేసే ప్రక్రియలో ఉన్నాయని రాహుల్ గాంధీ శనివారం 'ఎక్స్‌'లో హిందీలో పోస్ట్ చేశారు.

"దళిత యువత - మీ గొంతులను పెంచండి, మిమ్మల్ని మీరు సంఘటితపరచుకోండి, ఒకరికొకరు తోడుగా నిలబడండి. డిమాండ్: రోహిత్ వేముల చట్టాన్ని ఇప్పుడే అమలు చేయండి. మనకు ఇప్పుడు వివక్ష నిరోధక చట్టం అవసరం" అని ఆయన నొక్కి చెప్పారు. జస్టిస్ ఫర్ రోహిత్ వేముల ఉద్యమం దశాబ్ద కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా, కర్ణాటకలోని అంబేద్కరిస్టులు, కుల వ్యతిరేక మేధావుల నేతృత్వంలోని ప్రజా ఉద్యమం రోహిత్ వేముల చట్టం యొక్క ముసాయిదాను సిద్ధం చేసింది. ముఖ్యమంత్రితో చర్చించిన తర్వాత రోహిత్ వేముల చట్టాన్ని తీసుకురావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని డిప్యూటీ సీఎం కమిటీకి తెలియజేశారు .

కర్ణాటకలో కమిటీ తయారుచేసిన చట్టం యొక్క ముసాయిదాను ప్రచార కమిటీ సభ్యులు విక్రమార్కకు సమర్పించారు. వేముల కేసుపై పారదర్శక విచారణ జరిపి ఆయనకు న్యాయం చేయాలని కూడా వారు డిమాండ్ చేశారు. వేముల మరణం తర్వాత విశ్వవిద్యాలయంలో నాన్-బెయిలబుల్ కేసులు నమోదైన 50 మంది విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులకు ఉపశమనం కల్పించాలని వారు అభ్యర్థించారు. కర్ణాటక తరహాలో తెలంగాణలో కూడా ఈ చట్టాన్ని ప్రవేశపెట్టాలని కమిటీ కోరింది.

"వేముల సంస్థాగత హత్యకు పదేళ్లు, న్యాయం నిరాకరించబడిన పదేళ్ల జ్ఞాపకార్థం జస్టిస్ ఫర్ రోహిత్ వేముల ఉద్యమానికి మద్దతుగా విద్యార్థులు స్వచ్ఛందంగా తరగతులను బహిష్కరించి వర్సిటీ క్యాంపస్‌లోని 'వెలివాడ' (నార్త్ షాప్‌కామ్) వద్ద గుమిగూడారు" అని UoH అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ (ASA) ఉపాధ్యక్షుడు దుష్యంత్ అన్నారు. రోహిత్ తల్లి రాధిక వేముల, గుజరాత్‌లోని కాంగ్రెస్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ, విద్యార్థులు తదితరులు వెలివాడలో రోహిత్ స్తూపానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వేములకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ అనేక మంది విద్యార్థులు క్యాంపస్‌లో 'మషల్ జూలూస్' (టార్చి ఊరేగింపు) కూడా నిర్వహించారని ఆయన అన్నారు.

Next Story