హైదరాబాద్ నుంచి తిరుపతికి బయలు దేరిన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ ఆర్టీసీ)కి చెందిన బస్సు బోల్తా పడింది. ఈ ఘటన వనపర్తి జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 15 మందికి ప్రయాణీకులకు గాయాలయ్యాయి.
పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. యాదగిరిగుట్ట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుంచి తిరుపతికి వెలుతోంది. శనివారం అర్థరాత్రి ఒంటి గంట సమయంలో వనపర్తి జిల్లా కొత్తకోటకు సమీపంలోకి రాగానే అదుపు తప్పి జాతీయ రహదారి 44 పై బోల్తా పడింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు.
15 మంది ప్రయాణీకులు గాయపడగా వెంటనే వారిని చికిత్స నిమిత్తం వనపర్తి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిలో నర్సింహ్మా, షకీలా, షబ్బీర్ అహ్మద్ అనే ప్రయాణీకుల పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 37 మంది ప్రయాణీకులు ఉన్నారు. మిగతా ప్రయాణీకులను ఇతర బస్సుల్లో గమ్యస్థానాలకు చేర్చారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అతివేగం, డ్రైవర్ నిద్ర మత్తులో ఉండడం వల్లే ప్రమాదం జరిగిందా..? అన్న కోణంలోనూ పోలీసులు విచారణ చేపట్టారు.