కాలి నడకన వెలుతున్న మహిళా కూలీలను లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా రాయపోల్‌లో సోమవారం జరిగింది.
స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. దౌల్తాబాద్ నుంచి గజ్వేల్ వైపు వెలుతున్న లారీ రాయపోల్ సమీపంలో అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టింది. అదే సమయంలో రాయపోల్ మండల కేంద్రంలో కూలీ పనుల కోసం 10 మంది కూలీలు కాలి నడకన వెలుతుండగా వారి పైకి దూసుకువెళ్లింది.
ఈ ఘటనలో తిప్పా శ్యామల(39), కవిత(35) అక్కడికక్కడే మృతి చెందగా రాజమణి తీవ్రంగా గాయపడింది. వెంటనే స్పందించిన స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. తమకు న్యాయం చేయాలని బాధితుల కుటుంబ సభ్యులు రోడ్డు పై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఘటనాస్థలిని పరిశీలించిన అనంతరం మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.