తీవ్రంగా శ్రమిస్తున్న రేవంత్ రెడ్డి సోదరులు
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు
By Medi Samrat Published on 21 Nov 2023 9:00 PM ISTకొడంగల్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఆయన మిగిలిన కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకోడానికి ప్రయత్నిస్తూ ఉండగా.. రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్న కొడంగల్, కామారెడ్డి నియోజకవర్గాల్లో ఆయన విజయం సాధించేందుకు ఆయన నలుగురు సోదరులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కామారెడ్డిలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుపై కూడా రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే!!
కొడంగల్ కర్ణాటక సరిహద్దులో తెలంగాణ రాష్ట్ర దక్షిణ భాగంలో ఉండగా, తెలంగాణ ఉత్తర భాగంలో కామారెడ్డి ఉంది. రేవంత్ రెడ్డి కామారెడ్డిలో సీఎం కేసీఆర్‌తోనూ.. కొడంగల్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డితోనూ తలపడుతున్నారు. రెండు సెగ్మెంట్లలో అతని ప్రధాన ప్రత్యర్థులు భారత రాష్ట్ర సమితి (BRS) నుండే ఉన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ కావడం, ఈసారి కాంగ్రెస్ గెలిస్తే ముఖ్యమంత్రి పదవి దక్కుతుందన్న ఆశతో ఉన్న రేవంత్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా దూకుడుగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
అట్టడుగు స్థాయి నుండి ప్రచారంలో సోదరులు:
రేవంత్ రెడ్డి ఇతర నియోజకవర్గాలలో ప్రచారంలో బిజీగా ఉన్నప్పుడు.. ఆయన నలుగురు సోదరులు - తిరుపతి రెడ్డి, జగదీశ్వర రెడ్డి, కొండల్ రెడ్డి, కృష్ణా రెడ్డి ఈ రెండు అసెంబ్లీ స్థానాల్లో మాత్రం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఏడుగురు అన్నదమ్ముల్లో రేవంత్ రెడ్డి నాలుగో వ్యక్తి. ఇద్దరు అన్నదమ్ములు చనిపోయారు. కొడంగల్‌లో రేవంత్‌రెడ్డి అన్నయ్య తిరుపతి, తమ్ముడు కృష్ణ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తుండగా, తమ్ముడు కొండల్ రెడ్డి కామారెడ్డిని చూసుకుంటున్నారు. అమెరికా నుంచి వచ్చిన మరో తమ్ముడు జగదీశ్వర రెడ్డి కామారెడ్డిలో ప్రచారం చేస్తున్నారు.
‘‘స్థానిక నేతలతో కలిసి ప్రచారం చేస్తున్నాం. మా అన్న (రేవంత్ రెడ్డి) వస్తే మండల స్థాయిలో ప్రచారం చేస్తాం. కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో ప్రచారాన్ని పూర్తి చేశామని ఇక మూడు మండలాలు మిగి ఉన్నాయి" అని వ్యాపారాన్ని నిర్వహిస్తున్న కృష్ణా రెడ్డి పిటిఐకి చెప్పారు.
70 శాతం ప్రాంతాలను కవర్ చేశాం:
కొండగల్ ఇన్ చార్జిగా ఉన్న పెద్దన్న తిరుపతి గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. " ఇప్పటిదాకా ప్రచారానికి సంబంధించి మేము 70-80 శాతానికి చేరుకున్నాము. మాకు ఇంకా సమయం ఉంది, మేము ప్రతి ఒక్కరికీ చేరువయ్యేలా ప్లాన్ చేస్తున్నాము," అని అన్నారు. రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గానికి తగిన సమయం ఇవ్వడం లేదన్న ప్రజల ఫిర్యాదులపై కృష్ణ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయడం కొడంగల్ ప్రజలకు గర్వకారణమన్నారు. “ప్రత్యర్థి పార్టీని ఓడించాలనే ఉద్దేశ్యంతో ప్రజలు నా సోదరుడి తరపున ప్రచారం చేస్తున్నారు. ఆయనను భారీ మెజార్టీతో గెలిపించేందుకు స్థానిక నేతలు కసరత్తు చేస్తున్నారు. మా అన్నపై వారికి ఉన్న నమ్మకమే మా బలం" అని అన్నారు. కొడంగల్‌లో 2.36 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. “ మాకు మంచి స్పందన వస్తోంది. 40,000-50,000 ఓట్ల భారీ మెజారిటీతో గెలుస్తామనే నమ్మకం ఉంది" అని ఆయన అన్నారు.
చివరి దశకు చేరుకున్న ప్రచారం:
కామారెడ్డిలో ఎన్నికల ప్రచారాన్ని మరో సోదరుడు కొండల్ చూస్తున్నారు. ఈ అసెంబ్లీ సెగ్మెంట్‌లోని ఏడు మండలాల్లో రేవంత్‌రెడ్డి రెండు మండలాల్లో ప్రచారాన్ని పూర్తి చేసి మిగిలిన మండలాల్లో త్వరలోనే పర్యటించనున్నారు. కామారెడ్డిలో పలు కార్నర్ మీటింగ్‌లు, ఒక టౌన్ హాల్ సమావేశాలు ఇప్పటికే నిర్వహించారు. కామారెడ్డిలో ఎన్నికల ప్రచారంలో చివరిదశలో తన అన్నకు సాయం చేస్తున్నారు జగదీశ్వర రెడ్డి. ఆయన మాట్లాడుతూ.. ‘‘నేను అమెరికాలో స్థిరపడిన వ్యాపారవేత్తను, రాజకీయాల్లో ఎప్పుడూ పాల్గొనలేదు. ఈసారి నా వంతు కృషి చేయడానికి నేను అమెరికా నుండి వచ్చాను." అని తెలిపారు.
కొడంగల్ నుంచి రెండుసార్లు తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఎమ్మెల్యేగా ఎన్నికైన రేవంత్ రెడ్డి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేసి బీఆర్‌ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత మల్కాజిగిరి నుంచి లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించారు. ఇప్పుడు కామారెడ్డిలో సీఎం కేసీఆర్‌పై తొలిసారి రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్నారు.