కేసీఆర్ ను ఓడించడానికి కామారెడ్డి వచ్చా : రేవంత్ రెడ్డి

తెలంగాణ భవిష్యత్‌ను కామారెడ్డి ప్రజలు నిర్ణయించబోతున్నారని, బీఆర్ఎస్ పాలనకు చరమగీతం పాడేందుకు..

By Medi Samrat  Published on  10 Nov 2023 7:17 PM IST
కేసీఆర్ ను ఓడించడానికి కామారెడ్డి వచ్చా : రేవంత్ రెడ్డి

తెలంగాణ భవిష్యత్‌ను కామారెడ్డి ప్రజలు నిర్ణయించబోతున్నారని, బీఆర్ఎస్ పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, ఇక్కడి ప్రజలు ఇచ్చే తీర్పు కోసం దేశం ఆసక్తిగా చూస్తోందన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. శుక్రవారం కామారెడ్డిలో రేవంత్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం జరిగిన బీసీ డిక్లరేషన్ సభలో ప్రసంగించారు. ఎమ్మెల్యేగా కావాలనుకుంటే కాంగ్రెస్ కార్యకర్తలు ఎక్కడైనా గెలిపిస్తారు కానీ కేసీఆర్ ను ఓడించేందుకు కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నా అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. "తెలంగాణ భవిష్యత్‌ను కామారెడ్డి ప్రజలు నిర్ణయించబోతున్నారు. బీఆర్ఎస్ పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇక్కడి ప్రజలు ఇచ్చే తీర్పు కోసం దేశం ఆసక్తిగా చూస్తోంది. గజ్వేల్‌ ప్రజలను కేసీఆర్‌ పదేళ్లపాటు మోసం చేశారు. కామారెడ్డి భూములపై కేసీఆర్‌ కన్నుపడింది.. అందుకే పోటీ చేస్తున్నారు" అని రేవంత్ రెడ్డి అన్నారు.

కేసీఆర్ సచివాలయానికి రారు ప్రజా సమస్యలను పరిష్కరించరు అని రేవంత్ రెడ్డి విమర్శించారు. 2015లో లింబయ్య అనే రైతు సెక్రటేరియట్ ఎదురుగా ఉరేసుకున్నాడు. రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. అమ్మకం కోసం తీసుకొచ్చిన ధాన్యం కుప్ప మీదే రైతు బీరయ్య ప్రాణం పోయింది. కేసీఆర్ మీది ఇదే ఊరని చెప్తున్నావు కోనాపూర్‌లో నీ తల్లి గారి ఊరే అయితే ఆత్మహత్య చేసుకున్న రైతులను ఎందుకు ఆదుకోలేదు అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

కామారెడ్డిని బంగారు తునక చేస్తా అంటున్న నువ్వు గజ్వేల్‌లో ఏం చేసినవు?. గజ్వేల్ ప్రజలు నీకు అండగా ఉంటే కామారెడ్డికి ఎందుకు వచ్చినవ్. కామారెడ్డిలో మాస్టర్ ప్లాన్‌తో భూములు కొల్లగొట్టడానికి వస్తున్నావు అని రేవంత్ రెడ్డి విమర్శించారు. రైతులు తిరగబడటంతో కొడుకును పంపి మాస్టర్ ప్లాన్ రద్దు చేసిండు. రద్దయింది మాస్టర్ ప్లాన్ కాదు.. మీ ప్రభుత్వమే రద్దయింది అని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.

ఒక బీసీ బిడ్డ గంపగోవర్ధన్ సీటు కేసీఆర్ గుంజుకున్నాడు అని రేవంత్ రెడ్డి విమర్శించారు. గంప గోవర్ధన్‌ను గంప కింద కమ్మినట్లు... కామారెడ్డి ప్రజలను కూడా గంప కింద కమ్మాలనుకుంటే కామారెడ్డి ప్రజలు ఊరుకోరన్నారు. నీకు బీసీ నేత సీటు కావాల్సి వచ్చిందా? అన్నారు. కేసీఆర్ పోటీ చేయాలనుకుంటే సిద్దిపేట, సిరిసిల్ల లేవా? అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కామారెడ్డి ప్రజలు కేసీఆర్ ను బండకేసి కొట్టుడు ఖాయమన్నారు.

కేసీఆర్‌ను రెండుసార్లు ముఖ్యమంత్రిని చేస్తే లక్ష కోట్లు సంపాదించుకున్నారని, ఇప్పుడు మూడోసారి గెలిపించమని చెబుతున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబానికే పదవులు వచ్చాయన్నారు. మీరు పదవులు అనుభవించేందుకు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారా? ఆర్టీసీ కార్మికులు, సింగరేణి కార్మికులు, ఉద్యోగులు ఉద్యమాలు చేశారా? అని నిలదీశారు. తాను ఎమ్మెల్యేను అవ్వాలంటే తనను ఎక్కడైనా ప్రజలు గెలిపిస్తారని, కానీ కేసీఆర్‌ను రాజకీయంగా బొంద పెట్టాలనే ఉద్దేశ్యంతోనే తాను కామారెడ్డిలో పోటీ చేస్తున్నానన్నారు. కేసీఆర్‌కు బుద్ధి చెప్పాలని షబ్బీర్ అలీతో పాటు, తమ పార్టీ అధిష్ఠానం తనకు చెప్పిందన్నారు.

ఎమ్మెల్యేను కొనడానికి పోయిన రేవంత్ ను మీరు ఎమ్మెల్యే చేయొద్దు అని కేసీఆర్ అంటుండు..40 ఎమ్మెల్యేలను 12 మంది ఎమ్మెల్, ఇద్దరు ఎంపీలను కొన్నది నీవు కదా....గంపగోవర్ధన్ ఏ పార్టీ వాడు... ఆయన్ను టీడీపీ నుంచి నువ్వు కొనలేదా? ఆలుగడ్డ శీను, సబితమ్మ తదితరులను ఏ పార్టీ గెలిపిస్తే... వారు ఏ పార్టీలో ఉన్నారని రేవంత్ రెడ్డి నిలదీశారు. టీడీపీ, కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీల నుంచి ఎమ్మెల్యేలను, జెడ్పీటీసీలను, ఎంపీటీసీలను కొనుగోలు చేసింది నిజం కదా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అమ్మకాలు, కొనుగోలు కేంద్రంగా మార్చిందే కేసీఆర్.. కేసీఆర్ కు నేను సూటిగా సవాల్ విసురుతున్నా ఎమ్మెల్యేలు , ఎంపీలు, ప్రజాప్రతినిధుల కొనుగోళ్లపై సీబీఐ విచారణకు నేను సిద్ధం.. నువ్వు సిద్ధమా? నీవు సిద్ధమైతే వెంటనే సీబీఐకి ఉత్తరం రాయాలని సవాలు విసిరాడు రేవంత్ రెడ్డి. కామారెడ్డి ప్రజలకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ గెలవాలి...ఆరు గ్యారంటీలు అమలు కావాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి అని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

Next Story