రాష్ట్రం, దేశం ప్రమాదంలో ఉన్నాయని, ఇలాంటి సమయంలో వ్యక్తిగత అంశాలను పక్కనపెట్టి ప్రజల కోసం పోరాడాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గాంధీ భవన్‌లో వేడుకలు నిర్వహించారు. ఇందులో పాల్గొన్న రేవంత్ రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు.
అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు. కేంద్రంలో ఉన్నబీజేపీ బ్రిటీష్ విధానాలను దేశ ప్రజలపై రుద్దాలని చూస్తోందని ఆరోపించారు. దేశ భూభాగాన్ని చైనా ఆక్రమించుకుంటుంటే ప్రశ్నించలేని దౌర్భాగ్య స్థితిలో మోదీ సర్కార్ ఉందన్నారు. రాహుల్ గాంధీ పాదయాత్ర భయంతోనే ప్రధాని మోదీ కరోనా రూల్స్ తీసుకొచ్చారన్నారు. ఇలాంటి సమయంలో మనకున్న సమస్యలు పక్కన పెట్టి ప్రజల కోసం పోరాడాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
జనవరి 26 నుంచి ప్రారంభమయ్యే హాత్ సే హాత్ జోడో యాత్రలో కాంగ్రెస్ శ్రేణులంతా పాల్గొనాలని రేవంత్ రెడ్డి కోరారు. ఇక పార్టీలో ఉన్న అంతర్గత సమస్యల గుర్తించి బహిరంగ వేదికలపై చర్చించ వద్దని పార్టీ నేతలకు సూచించారు. కేసీఆర్ చేతిలో తెలంగాణ రాష్ట్రం విధ్వంసానికి గురైంది. కుటుంబ సభ్యులకు దోచిపెట్టడానికి ఇప్పుడు దేశం మీద పడ్డారు అని రేవంత్ రెడ్డి అన్నారు.