ఎంపీ పదవికి రాజీనామా చేసిన రేవంత్‌రెడ్డి

తెలంగాణ రెండో సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.

By Srikanth Gundamalla  Published on  6 Dec 2023 2:15 PM IST
revanth reddy, resign,  mp post, congress, telangana ,

ఎంపీ పదవికి రాజీనామా చేసిన రేవంత్‌రెడ్డి

తెలంగాణ రెండో సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ క్రమంలోనే ఆయన ప్రమాణస్వీకారం కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు మధ్యాహ్నం ఎల్బీ స్టేడియంలో రేవంత్‌రెడ్డి సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. అయితే.. రేవంత్‌రెడ్డి ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. వరుసగా కాంగ్రెస్‌ అగ్రనేతలను కలిశారు. సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్‌, ప్రియాంక గాంధీలను కలిశారు. తన ప్రమాణస్వీకారోత్సవానికి హాజరుకావాలని వారిని కోరారు. ఈ సందర్భంగా వారు రేవంత్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే అగ్రనేతలతో తెలంగాణ కేబినెట్ కూర్పుపైనా చర్చించినట్లు సమాచారం అందుతోంది.

కాగా.. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ నేతలను కలిశాక పార్లమెంట్‌కు కూడా వెళ్లారు. ఆయన 2019 లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజిగిరి ఎంపీగా గెలిచిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన తెలంగాణ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనుండటంతో ఎంపీ పదవికి రాజీనామా చేశారు. లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేసిన రేవంత్‌.. ఆ లేఖను స్పీకర్‌కు అందజేశారు. పార్లమెంట్‌ సమావేశాలకు హాజరైన పలువరు ఎంపీలను కూడా ఆయన కలిశారు. రూమ్‌ నెంబర్ 66లో వారితో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోతున్న రేవంత్‌రెడ్డికి ఎంపీలంతా శుభాకాంక్షలు తెలియజేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి కొడంగల్‌ నుంచి గెలిచారు. మరోచోట కామారెడ్డి నుంచి పోటీ చేయగా.. అక్కడ ఓడిపోయారు. బీజేపీ అభ్యర్థి గెలవగా రేవంత్‌రెడ్డి మూడోస్థానంలో నిలిచారు. రెండోస్థానంలో మాజీ సీఎం కేసీఆర్ ఉన్నారు. కాగా.. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మొత్తం 64 సీట్లు వచ్చాయి.

Next Story