'రైతులకు 24 గంటల ఫ్రీ కరెంట్ ఇస్తాం'.. రేవంత్ రెడ్డి హామీ

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తామని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ ఎ. రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

By అంజి  Published on  15 Nov 2023 3:45 AM GMT
Telangana polls, Revanth Reddy, free power, farmers

'రైతులకు 24 గంటల ఫ్రీ కరెంట్ ఇస్తాం'.. రేవంత్ రెడ్డి హామీ

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తామని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ ఎ. రేవంత్ రెడ్డి మంగళవారం హామీ ఇవ్వడంతో తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో విద్యుత్ సమస్య ఆధిపత్యం కొనసాగుతోంది. రైతులకు ఉచిత కరెంటు ఇవ్వడం ప్రారంభించింది కాంగ్రెస్సేనని, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తామని రేవంత్ రెడ్డి స్పష్టమైన హామీ ఇచ్చారు.

రైతులకు 24 గంటల కరెంటు అవసరం లేదని, మూడు గంటల కరెంటు సరిపోతుందని ఆయన చేసిన ప్రకటనపై అధికార భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) దాడి కొనసాగిస్తున్న నేపథ్యంలో వర్ధన్నపేట నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కె. చంద్రశేఖర్‌రావు ప్రతి ఎన్నికల ర్యాలీలోనూ.. అమెరికా పర్యటనలో రేవంత్‌రెడ్డి రైతులకు విద్యుత్‌ సరఫరాపై చేసిన ప్రకటనను ఉదహరిస్తున్నారు.

''మీకు 24 గంటల కరెంటు కావాలా లేక 3 గంటల కరెంటు కావాలా? దేశంలోనే రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ'' అని కేసీఆర్ ప్రజలను ప్రశ్నిస్తున్నారు. 10 సంవత్సరాల క్రితం తెలంగాణ ఏర్పడిన తర్వాత, బీఆర్‌ఎస్‌ విద్యుత్ సమస్యలను అధిగమించి రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ను ఎలా అందించిందో కూడా ఆయన వివరించారు.

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటి రామారావుతోపాటు అధికార పార్టీకి చెందిన నేతలు కూడా విద్యుత్‌ సమస్యపై కాంగ్రెస్‌పై విరుచుకుపడుతున్నారు. మీకు కరెంట్ కావాలా కాంగ్రెస్ కావాలా అని కేటీఆర్ రోడ్ షోలలో ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పాలిత కర్ణాటక మాదిరిగా తెలంగాణ కూడా అంధకారంలో కూరుకుపోతుందని ప్రజలను హెచ్చరిస్తున్నారు.

కరెంటు కొరతతో కొట్టుమిట్టాడుతున్న కర్నాటక రైతులకు కేవలం ఐదు గంటల కరెంటు మాత్రమే సరఫరా చేస్తోందని ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలంగాణలో జరిగిన కొన్ని ఎన్నికల సభల్లో వెల్లడించారు. 24 గంటల కరెంటు ఇస్తున్న రాష్ట్రంలో దీన్ని సాధించినందుకు శివకుమార్‌ సిగ్గుపడాలని కేసీఆర్‌ దుయ్యబట్టారు.

'కాంగ్రెస్‌ అధికారంలోకి రాకుండా రాష్ట్ర ప్రజలను హెచ్చరించేందుకు' ఇటీవల కర్ణాటకకు చెందిన రైతుల బృందం తెలంగాణలోని కొన్ని ప్రాంతాలను సందర్శించింది. అయితే పార్టీని బద్నాం చేసేందుకు కర్ణాటక నుంచి కొంతమంది కిరాయి వ్యక్తులను బీఆర్‌ఎస్ తీసుకొచ్చిందని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ నేతలకు ధీటుగా రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు 24 గంటల కరెంట్‌ ఇస్తామని ప్రకటించడం మొదలుపెట్టారు.

మంగళవారం జరిగిన బహిరంగ సభల్లో ఆయన మాట్లాడుతూ.. ఎవరూ ఆలోచించకముందే 20 ఏళ్ల క్రితమే రైతులకు కాంగ్రెస్ ఉచిత విద్యుత్ ఇచ్చిందన్నారు. ''కేసీఆర్ ఎలా చేయాలో నేర్పుతున్నారు. తాతగారికి నేర్పినట్లే. మేము ఇప్పటికే చేసాము. అధికారంలోకి రాగానే రైతులందరికీ 24 గంటల ఉచిత, నాణ్యమైన కరెంటు ఇవ్వడం మా బాధ్యత'' అని అన్నారు. అధికారంలోకి వస్తే రైతుబంధు అమలును అడ్డుకుంటామని కాంగ్రెస్‌పై కేసీఆర్ అసత్య ప్రచారం చేస్తున్నారని రేవంత్ రెడ్డి అన్నారు.

ప్రతి రైతుకు ఎకరాకు రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని ఆరు హామీల కింద కాంగ్రెస్‌ కూడా ప్రకటించిందని గుర్తు చేశారు. వ్యవసాయ కూలీలకు కూడా ఏటా రూ.12వేలు అందజేస్తామన్నారు.

Next Story