సీఎం రేవంత్‌ రూ.80,500 కోట్ల అప్పు చేశారు: కేటీఆర్‌

రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి 10 నెలల్లో రూ.80,500 కోట్ల అప్పులు చేసినట్టు కేటీఆర్‌ ఆరోపించారు.

By అంజి  Published on  16 Oct 2024 10:06 AM IST
Revanth Reddy, Chief Minister, KTR, debt

సీఎం రేవంత్‌ రూ.80,500 కోట్ల అప్పు చేశారు: కేటీఆర్‌

రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి 10 నెలల్లో రూ.80,500 కోట్ల అప్పులు చేసినట్టు కేటీఆర్‌ ఆరోపించారు. 10 నెలల్లో 80,500 కోట్ల రికార్డు అప్పులు అయ్యాయని అన్నారు. ''అప్పు తప్పు అన్నోళ్లని ఇప్పుడు దేనితో కొట్టాలి? ఎన్నికల హామీలేవీ తీర్చలేదు. ఏ కొత్త సాగునీటి ప్రాజెక్టు కట్టలేదు. మరి ముఖ్యమంత్రి తెస్తున్న అప్పు ఏమైనట్టు? రూ.80 వేల కోట్ల ధనం ఎవరి జేబులోకి వెళ్లినట్టు? బడా కాంట్రాక్టర్ల బిల్లులకే ధారాదత్తం చేస్తున్నారా ? కమీషన్ల కోసం కక్కుర్తి పడే అప్పులు తెస్తున్నారా?'' అని కేటీఆర్‌ ప్రశ్నించారు.

''అప్పు.. శుద్ధ తప్పు అని ప్రచారంలో ఊదరగొట్టి.. అవే అప్పుల కోసం ముఖ్యమంత్రి పాకులాడటమేంటి? బీఆర్‌ఎస్‌ హయాంలో అప్పులు తీసుకుని ప్రాజెక్టులు కట్టాం. ప్రతిపైసాతో మౌలిక సదుపాయాలు పెంచాం.. తీసుకున్న రుణంతో దశాబ్దాల కష్టాలు తీర్చాం.. కానీ.. ముఖ్యమంత్రి తెస్తున్న అప్పుల "అడ్రస్" ఎక్కడ ? '' అని కేటీఆర్‌.. ప్రభుత్వాన్ని నిలదీశారు.

''రుణమాఫీ చేయకుండా, రైతుభరోసా వేయకుండా, ఒక్క కొత్త ప్రాజెక్టు కట్టకుండా, నెలలపాటు జీతాలు ఇవ్వకుండా, ఇన్ని వేలకోట్లు ఏమైనట్టు ? ఎవరి జేబుల్లోకి వెళ్లినట్టు ?? రాష్ట్ర సంపద సృష్టికి కాకుండా సొంత ఆస్తులు పెంచుకోవడానికి.. అప్పులు చేయడం క్షమించరాని నేరం. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకు పెను ప్రమాదం'' అని కేటీఆర్‌ పేర్కొన్నారు.

Next Story