మనలో మనకు గొడవలు వద్దు: రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యక్తిగత దూషణలకూ దూరంగా ఉండాలని
By Medi Samrat Published on 14 Aug 2022 5:02 PM ISTతెలంగాణ కాంగ్రెస్ ను ముఖ్యంగా వేధిస్తున్న సమస్య ఏమిటంటే నాయకుల మధ్య సఖ్యత లేకపోవడం. కాంగ్రెస్ నేతల మధ్య అంతర్గత కుమ్ములాటలతో పార్టీకి, ప్రజలకు నష్టం జరుగుతోందని, మునుగోడు ఉప ఎన్నికపై దృష్టి పెట్టకుండా.. వ్యక్తిగత విమర్శలపై దృష్టి మళ్లుతోందని అన్నారు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. అది నియోజకవర్గ ప్రజలకు తీవ్ర నష్టం కలిగిస్తోందని అన్నారు. రేవంత్ రెడ్డి ఇందుకు సంబంధించి ఓ వీడియో విడుదల చేశారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మునుగోడు నియోజకవర్గానికి నిధులిచ్చి ఓట్లు అడగాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. మునుగోడులో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను, పోడు భూముల సమస్యలతోపాటు స్థానిక ప్రజల ఇబ్బందులను పరిష్కరించాలని అన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్, సీఎం కేసీఆర్ కు ప్రజల సమస్యలను పరిష్కరించకుండా ఓట్లు అడిగే హక్కే లేదని పేర్కొన్నారు. ప్రజల పక్షాన నిలిచి ప్రశ్నించాల్సిన బాధ్యత కాంగ్రెస్‌పై ఉందని.. ప్రజల సమస్యలపై, ప్రభుత్వ తప్పుడు విధానాలపై మునుగోడులో చర్చ జరగాల్సి ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యక్తిగత దూషణలకూ దూరంగా ఉండాలని, ప్రజా సమస్యల గురించి ప్రస్తావించాలని సూచించారు.
Next Story