మీ అవినీతిలో వాటా అడిగారా..? మంత్రి జ‌గ‌దీష్ రెడ్డిపై రేవంత్‌ ఫైర్

Revanth Reddy Fires On Minister Jagadeesh Reddy. కాంగ్రెస్ కార్యకర్తలపై వేధింపులు అపకపోతే ప్ర‌భుత్వానికి తగిన బుద్ధి చెపుతామని టీపీసీసీ

By Medi Samrat  Published on  28 July 2021 3:12 PM IST
మీ అవినీతిలో వాటా అడిగారా..? మంత్రి జ‌గ‌దీష్ రెడ్డిపై రేవంత్‌ ఫైర్

కాంగ్రెస్ కార్యకర్తలపై వేధింపులు అపకపోతే ప్ర‌భుత్వానికి తగిన బుద్ధి చెపుతామని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి హెచ్చ‌రించారు. తెలంగాణలో రాచరిక నియంతృత్వ పాలన జరుగుతోందని.. ప్రజాస్వామ్యం నిలువునా ఖూనీ అవుతుందని ఫైర్ అయ్యారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనకుండా పోలీసులు అడ్డుకోవడం హక్కులను హరించడమేన‌ని.. ఇది దారుణమ‌న్నారు.


వేలాది పోలీసులు, టీఆర్ఎస్ గుండాలు కాంగ్రెస్ కార్యకర్తలను సమావేశానికి రాకుండా చెక్ పోస్ట్ లు పెట్టి అడ్డుకుని.. బైండోవర్లు చేశారని అన్నారు. ఒక ఎమ్మెల్యే అధికారికంగా చేయాల్సిన కొత్త రేషన్ కార్డుల పంపిణీని.. టీఆర్ఎస్ గుండాలు, పోలీసుల సమక్షంలో మంత్రి జగదీశ్వర్ రెడ్డి చేపట్టారని అన్నారు. ఒక ఎమ్మెల్యే హక్కులను మంత్రి దగ్గరుండి కాలరాస్తున్నారని మండిప‌డ్డారు.

మా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తన నియోజకవర్గ కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రాన్ని ఇచ్చేందుకు వెళ్తుంటే.. వేలాది మంది పోలీసులు, టీఆర్ఎస్‌ గుండాలు.. కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకున్నారని అన్నారు. దళిత బంధు కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ఎమ్మెల్యే మంత్రిని అడగడం తప్పా.. దళిత బంధు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయమంటే కేసులు పెట్టి వేధిస్తారా? అని ప్ర‌శ్నించారు.

రాజగోపాల్ రెడ్డి దళితుల కోసమే మాట్లాడారు తప్పా.. మీ అవినీతి లో వాటా అడిగారా.. అని మంత్రి జ‌గ‌దీష్ రెడ్డిపై రేవంత్‌ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, నాయకులను ఇలాగే కేసులు పెట్టి వేధిస్తే.. ఎక్కడికక్కడ అడ్డుకుంటామ‌ని.. అరెస్ట్ చేసిన కాంగ్రెస్ కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి జగదీశ్వర్ రెడ్డి అరాచకాలు మానుకోకపోతే.. తగిన బుద్ధి చెబుతామ‌ని హెచ్చ‌రించారు.

ఇదిలావుంటే.. గ‌త సోమవారం చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలో కొత్త రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించి ప్రొటోకాల్ విషయంలో మంత్రి జగదీష్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ మధ్య వివాదం జరిగింది. మునుగోడు నియోజక వర్గానికి వస్తే అడ్డుకుంటామన్నారు. దీనిపై మంత్రి ప్రతి సవాల్ విసిరారు. మునుగోడు నియోజకవర్గానికి వస్తానని, అన్ని గ్రామాలు తిరుగుతానని అన్నారు. ఇవాళ కొత్త రేషన్ కార్డుల పంపిణీ కోసం మంత్రి మునుగోడు వచ్చారు. ఈ నేపథ్యంలో రాత్రి నుంచి పోలీసులు కాంగ్రెస్ నాయకులను ముందస్తు అరెస్టులు చేశారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ బెంగళూర్ టోల్ ప్లాజా వద్ద కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


Next Story