కేసీఆర్ కు అధికారం ఇస్తే వచ్చేది లిక్కర్ సర్కారే

Revanth Reddy Fire On KCR. గ‌త ఎనిమిదేళ్లుగా కేసీఆర్, మోదీ ఒక‌రికొక‌రు స‌హ‌క‌రించుకున్నారని టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి

By Medi Samrat  Published on  14 Dec 2022 5:42 PM IST
కేసీఆర్ కు అధికారం ఇస్తే వచ్చేది లిక్కర్ సర్కారే

గ‌త ఎనిమిదేళ్లుగా కేసీఆర్, మోదీ ఒక‌రికొక‌రు స‌హ‌క‌రించుకున్నారని టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. నాణానికి బొమ్మా, బొరుసులా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క‌లిసి ప‌నిచేస్తున్నాయని.. అధికారం నిల‌బెట్టుకునేందుకు బీఆర్ఎస్, బీజేపీ డ్రామాలాడుతున్నాయని విమ‌ర్శించారు. వారి నాట‌కాల‌ను తెలంగాణ ప్ర‌జ‌లంతా గ‌మ‌నిస్తున్నారని అన్నారు. తెలంగాణలో కొన్ని మీడియా సంస్థ‌ల‌ను కేసీఆర్ కొనేశారని రేవంత్ ఆరోపించారు. అందుకే సోష‌ల్ మీడియా వేదిక‌గా కాంగ్రెస్‌ ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై ప్ర‌భుత్వాన్నినిల‌దీస్తోందని పేర్కొన్నారు. కేసీఆర్ అవినీతిపై కూడా సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నామ‌ని తెలిపారు.

కేసీఆర్ అబ్ కీ బార్ కిసాన్ స‌ర్కార్ అన్న నినాదం ఇచ్చారు. కానీ కేసీఆర్ కుటుంబానికి లిక్క‌ర్‌కు అవినాభావ సంబంధం ఉంది. అందుకే మేం ఆయనది అబ్ కీ బార్ లిక్క‌ర్ స‌ర్కార్ అని విమ‌ర్శించాం. తెలంగాణ‌లో లిక్క‌ర్ పై ప్ర‌భుత్వ ఆదాయం రూ.10,500 కోట్ల నుంచి రూ.36వేల కోట్ల‌కు పెరిగిందని పేర్కొన్నారు. మ‌రోసారి కేసీఆర్ కు అవ‌కాశం ఇస్తే.. లిక్క‌ర్ స‌ర్కార్ ఏర్పాటు చేస్తార‌ని మేమే అన్నాం అని తెలిపారు.

ఎఫ్ఐఆర్ న‌మోదు చేయ‌కుండా, నోటీసులివ్వ‌కుండా పార్టీ వార్ రూంలో ఎలా సెర్చ్ చేస్తారు? అని ప్ర‌శ్నించారు. అర్థరాత్రి 200 మంది పోలీసులు మ‌ఫ్తీలో ఆఫీసుకు వ‌చ్చారు. అక్క‌డ‌కు వెళ్లిన మా నేత‌ల‌ను అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్ అంటే తెలంగాణ‌లో బీహార్ రాష్ట్ర స‌మితిగా మార్చాల‌నుకుంటున్నారా? అని ప్ర‌శ్నించారు. తెలంగాణ‌లో మోదీ మోడ‌ల్ పాల‌న‌ను కేసీఆర్ తీసుకు రావాల‌నుకుంటున్నారా? అని నిల‌దీశారు. న‌రేంద్ర మోదీ విధానం ఐస్‌( ఇన్‌కం టాక్స్‌, సీబీఐ, ఈడీ), నైస్ (నార్కోటిక్స్‌, ఇన్‌కం టాక్స్‌, సీబీఐ, ఈడీ ) అని సైటైర్లు సంధించారు. తెలంగాణ‌లో ఐస్‌, నైస్ మోడ‌ల్ చెల్ల‌దని అన్నారు.

కాంగ్రెస్ వార్ రూంపై దాడికి నిర‌స‌న‌గా పార్ఠీ ఆధ్వ‌ర్యంలో ఆందోళ‌నలు నిర్వహించామ‌ని తెలిపారు. ఈ కేసులో ఐదుగురిని అరెస్టు చేశారు. వారు ఇప్ప‌టి వ‌ర‌కు ఎక్క‌డ ఉన్నారో తెలియ‌దు. దీనిపై కోర్టులో హెబియస్ కార్ప‌స్ పిటీష‌న్ వేశాం. స‌రైన విధంగా స్పందించ‌క‌పోతే ప్ర‌జ‌ల్లోకి వెళ్లి ప్ర‌భుత్వ తీరును ఎండ‌గ‌డ‌తాం అని తెలిపారు.


Next Story