మనవడిని మంత్రిని చేసేందుకు కేసీఆర్ తాపత్రయపడుతున్నారు : రేవంత్
శేరిలింగంపల్లిలో ఎమ్మెల్యే గాంధీని ఈ ఎన్నికల్లో వంద మీటర్ల గోతి తీసి పాతిపెట్టాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
By Medi Samrat Published on 26 Nov 2023 3:00 PM GMTశేరిలింగంపల్లిలో ఎమ్మెల్యే గాంధీని ఈ ఎన్నికల్లో వంద మీటర్ల గోతి తీసి పాతిపెట్టాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రజలతో అన్నారు. శేరిలింగంపల్లి ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే గాంధీ ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడతారని మీరు భావించారు. కానీ భూములను అక్రమించుకుని తెగనమ్ముకుని అన్యాయం చేశారన్నారు. బీహెచ్ఈఎల్ ఏర్పాటు సమయంలో జగదీష్ గౌడ్ కుటుంబం 200 ఎకరాలు కోల్పోయిందన్నారు. ప్రజల మంచిని కోరే ఆ కుటుంబానికి చెందిన జగదీష్ గౌడ్ ను ఈ ఎన్నికల్లో ఆశీర్వదించండని ప్రజలకు సూచించారు.
కేసీఆర్ కు రెండుసార్లు అవకాశం ఇచ్చారు.. ఈసారి ఒక్క అవకాశం కాంగ్రెస్ కు ఇవ్వండని అభ్యర్ధించారు. పేదలకు ప్రవేశం లేని ప్రగతీభవన్ గేట్లు బద్దలు కొట్టాల్సిన బాధ్యత మీపై ఉందా.? లేదా.? అని ప్రశ్నించారు. ఉద్యమంలో సమిధలైంది నిరుద్యోగులు.. నిరుద్యోగుల సమస్యలు పట్టించుకోని కేసీఆర్ ను ఈ ఎన్నికల్లో పాతరేయాలన్నారు. 30 లక్షల నిరుద్యోగుల గురించి ఆలోచించని కేసీఆర్.. ఆయన మనవడిని మంత్రిని చేసేందుకు తాపత్రయపడుతున్నారని అన్నారు.
కేసీఆర్ బక్కోడు కాదు.. భూ బకాసురుడు.. ఈ బకాసురుడిని బొందపెట్టాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం.. చర్లపల్లి జైలులో కేసీఆర్ కుటుంబానికి డబుల్ బెడ్రూం ఇల్లు కట్టించడం ఖాయమన్నారు. బీఆర్ఎస్ ను బొందపెడితేనే.. రాష్ట్రానికి పట్టిన చీడ, పీడ విరగడవుతుందన్నారు. ఇందిరమ్మ రాజ్యంలోనే పేదలకు సంక్షేమ ఫలాలు అందుతాయన్నారు. శేరిలింగంపల్లిలో కాంగ్రెస్ ను గెలిపించండి.. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది అని హామీ ఇచ్చారు. ఇందిరమ్మ రాజ్యంలో ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతామన్నారు.