కేసీఆర్ దత్తత గ్రామంలో ప్రారంభమైన రేవంత్ దీక్ష
Revanth Reddy Deeksha starts in Muduchintalapalli.తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తనదైన దూకుడును
By తోట వంశీ కుమార్ Published on 24 Aug 2021 1:49 PM ISTతెలంగాణ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తనదైన దూకుడును కొనసాగిస్తున్నారు. టీఆర్‌ఎస్ సర్కారు ప్రవేశపెట్టిన దళిత బంధు పథకానికి కౌంటర్‌గా దళిత, గిరిజన దండోరా పేరుతో సభలు నిర్వహిస్తూ.. దళిత వర్గాలకు ఏడేళ్లలో జరిగిన అన్యాయాన్ని రేవంత్‌రెడ్డి ఎండగడుతున్నారు. ఇప్పటికే ఇంద్రవెళ్లి, రావిర్యాల సభలతో హోరెత్తించిన కాంగ్రెస్ పార్టీ కార్యాచరణకు మరింత పదును పెంచింది. దళిత గిరిజన ఆత్మగౌరవ దండోర సభలు కొనసాగిస్తూనే రెండ్రోజుల దీక్షకు డిసైడ్ అయింది.
అందులో భాగంగా సీఎం కేసీఆర్ దత్తత గ్రామమైన మూడు చింతలపల్లిలో దళిత, గిరిజన దండోరా దీక్షను కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. శామీర్‌పేట కట్టమైసమ్మ ఆలయంలో రేవంత్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి మూడు చింతలపల్లి దీక్షా శిబిరం వరకు కాంగ్రెస్ నేతలు ర్యాలీగా తరలివచ్చారు. మూడు చింతలపల్లికి చేరుకున్న రేవంత్‌రెడ్డి దీక్షను ప్రారంభించారు. ఈ దీక్ష రేపు సాయంత్రం 5 గంటలకు ముగియనుంది.
సాయంత్రం మూడుచింతలపల్లిలోని దళితవాడలో స్థానిక సమస్యలు అడిగి తెలుసుకోనున్నారు. ఒక వైపు దళిత గిరిజనుల హక్కుల సాధన కోసం పోరాడుతూనే మరో వైపు కేసీఆర్ దత్తత తీసుకున్న గ్రామాల్లో దుస్థితిని ప్రజల దృష్టికి తెచ్చేదుకు మూడు చింతల పల్లిని వేదిక చేసుకున్నట్లు చెబుతున్నారు రేవంత్‌రెడ్డి.
మరోవైపు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి దీక్షపై టీఆర్‌ఎస్ నేతలు మండిపడ్డారు. ఎంపీగా ఎన్నికైనప్పటి నుంచి పార్లమెంట్ నియోజకవర్గంలోని సమస్యలను ఏమేరకు పరిష్కరించావో చెప్పాలని టీఆర్ఎస్ పార్టీ మల్కాజ్‌గిరి పార్లమెంట్ ఇంచార్జ్ రాజశేఖర్‌రెడ్డి డిమాండ్ చేశారు. యాద్గిరిపల్లి ఉద్దమరి నుంచి ఆదర్శపల్లి వెళ్లే మార్గాన్ని ఆర్మీ అధికారులు మూసివేసినా సమస్యను పరిష్కరించేందుకు ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు.