రూ.2లక్షల రుణమాఫీ.. 2లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం: రేవంత్

సీఎం కేసీఆర్ కుటుంబం లక్ష కోట్ల అవినీతికి పాల్పడిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు.

By Srikanth Gundamalla  Published on  15 Aug 2023 8:28 AM GMT
Revanth Reddy, Congress, Telangana, Independence Day,

  రూ.2లక్షల రుణమాఫీ.. 2లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం: రేవంత్

సీఎం కేసీఆర్ కుటుంబం లక్ష కోట్ల అవినీతికి పాల్పడిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గాంధీ భవన్‌లో జాతీయ జెండా ఎగురవేశారు రేవంత్ రెడ్డి. ఆ తర్వాత పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసగించారు. కేసీఆర్ కుటుంబం లక్షకోట్ల అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. 10వేల ఎకరాలు దోచుకుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హడావుడిగా అమ్మిన భూములపై అధికారంలోకి వచ్చాక సమీక్షిస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అన్నారు.

దేశానికి స్వాతంత్ర్య ఫలాలు అందించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆనాడు పోరాటం చేశారని.. ప్రాణాలను సైతం లెక్కచేయలేదని అన్నారు రేవంత్‌రెడ్డి. “అహింస మార్గంతో పోరాటం చేయవచ్చని నిరూపించిన మహనీయుడు మహాత్మా గాంధీ అనీ.. దేశంలో ఓటును ఆయుధంగా మార్చి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించారని అన్నారు. కరువు కాటకాలతో తల్లడిల్లుతున్న దేశానికి మహా నేత నెహ్రూ సంక్షేమ ఫలాలు అందించారని తెలిపారు. దేశం కోసం వీర వనిత ఇందిరా గాంధీ ప్రాణాలు అర్పిస్తే ఐటీ రంగం ద్వారా సాంకేతికంగా దేశాన్ని రాజీవ్ గాంధీ మరింత ముందుకు తీసుకెళ్లారని రేవంత్ రెడ్డి అన్నారు.

కానీ దేశంలో విభజించు పాలించు విధానాన్ని బ్రిటిష్ జనతా పార్టీ (బీజేపీ) అవలంబిస్తోందని రేవంత్ విమర్శించారు. విద్వేషాన్ని వీడాలని భారత్ జోడో యాత్రతో రాహుల్ గాంధీ స్ఫూర్తి నింపారు అని ఆయన అన్నారు. మొదటి ప్రధాని నెహ్రూ నుంచి మన్మోహన్ వరకు 60 ఏళ్లలో చేసిన అప్పుకంటే ఎనిమిదేళ్లలో మోదీ రెండింతలు ఎక్కువ అప్పు చేశారన్నారని రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని దివాళా తీయించారని ఆరోపించారు. దేశంలో నిరుద్యోగం తాండవిస్తోందని అన్నారు. ఇండియా కూటమి ద్వారానే మళ్లీ దేశానికి మంచిరోజులు వస్తాయని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అన్నారు.

ఇటు తెలంగాణ ప్రభుత్వంపైనా రేవంత్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఓటమి భయంతోనే కేసీఆర్ రుణమాఫీ, ఉద్యోగ నోటిఫికేషన్లు, డబుల్ బెడ్రూం ఇల్లు ఇస్తానని చెబుతున్నట్లు రేవంత్ పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీని సీఎం కేసీఆర్ నిర్వీర్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గడిచిన 9 ఏళ్లలో నోటిఫికేషన్లు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజలకు మేలు జరుగుతున్నదంటే అది కాంగ్రెస్ వల్లే... కేసీఆర్ ఏది చేసినా ప్రజలు నమ్మరు అని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని రేవంత్ చెప్పారు. ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇచ్చి ఆడబిడ్డలను ఆదుకుంటామన్నారు. ఇక ఇళ్ల నిర్మాణాలకు ప్రతి పేదవాడికి రూ.5 లక్షలు ఇస్తామని ఏవంత్‌రెడ్డి తెలిపారు. ప్రజల్లోకి వెళ్లి కాంగ్రెస్‌ను అధికారంలోకి తెద్దామని.. బీఆర్ఎస్‌ను వెళ్లగొడదామని రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ కార్యకర్తలు, నాయకులకు పిలుపునిచ్చారు.

Next Story