హిమాన్షు సూచనలను కాంగ్రెస్ తీసుకుంటుంది: టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి
స్కూల్‌ను ప్రారంభించిన సందర్భంగా హిమాన్షు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 14 July 2023 10:56 AM ISTహిమాన్షు సూచనలను కాంగ్రెస్ తీసుకుంటుంది: టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి
తెలంగాణ సీఎం కేసీఆర్ మనవడు హిమాన్షు రావు అందరికీ తెలిసిన వ్యక్తే. ఇటీవల హిమాన్షు హైదరాబాద్ గౌలిదొడ్డిలోని కేశవనగర్ ప్రభుత్వ పాఠశాలకు రూ.కోటికి పైగా ఖర్చు పెట్టి మరమ్మత్తులు చేసి అద్భుతంగా తీర్చిదిద్దాడు. తనతో పాటు చదువుకున్న పలువురు మిత్రులతో కలిసి విరాళాలు సేకరించి స్కూల్‌ను సుందరంగా మార్చారు. ప్రయివేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను మార్చాడని హిమాన్షుని బీఆర్ఎస్ నాయకులు, స్థానికులు తెగ పొగిడేస్తున్నారు. అయితే.. స్కూల్ బాగు చేయించడం.. ప్రారంభించడం వరకు అంతా బాగానే జరిగింది. కానీ.. రీడిజైన్ చేసిన స్కూల్‌ను ప్రారంభించిన సందర్భంగా హిమాన్షు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హిమాన్షు చేసింది మంచి పని అయినా కూడా బీఆర్ఎస్ నాయకులకు తలనొప్పిగా మారిందనే చెప్పాలి.
రీడిజైన్ చేసిన స్కూల్‌ను ప్రారంభించిన సందర్భంగా హిమాన్షు ఇలా మాట్లాడారు. కేశవనగర్ స్కూల్‌కు తొలిసారి వచ్చినప్పుడు తన కళ్లో నుంచి నీళ్లు వచ్చాయని అన్నాడు. ఆ సమయంలో ఆడపిల్లలకు సరైన బాత్రూంలు లేవు. పందులు స్కూల్ పిల్లల మధ్యే తిరుగుతున్నాయి. కనీసం మెట్లు కూడా సరిగ్గా లేవు. ఆ పరిస్థితులను చూసి ఎంతో బాధేసిందని హిమాన్షు అన్నారు. దాంతో.. స్కూల్‌కు ఏదైనా చేయాలని అనుకుని నిర్ణయించుకున్నానని చెప్పాడు. ఆ క్రమంలోనే నిధులను సేకరించి పేదలకు ఉపయోగపడేలా ఖర్చు చేయాలనే ఆలోచనతో.. స్కూల్‌ను బాగు చేయించామని చెప్పాడు హిమాన్షు. ఈ స్కూల్‌ను రీడిజైన్ చేసి బాగు చేయడం తాత కేసీఆర్ నుంచి స్ఫూర్తి పొందానని అన్నారు. దీని కోసం స్నేహితులంతా ఎంతో సహకరించారని ఈ సందర్భంగా తెలిపారు హిమాన్షు. అయితే.. హిమాన్షు చేసిన పనికి చాలా మంది ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ప్రజా సేవలో ఇప్పటి నుంచే ఉంటున్నారంటూ పొగుడుతున్నారు. కానీ కొందరు మాత్రం విమర్శలు చేస్తున్నారు. ఎలా అంటే ప్రభుత్వ స్కూల్‌లో కనీస సదుపాయాలు లేవని.. తెలంగాణ ప్రభుత్వ వైఫల్యమే అంటున్నారు. దీనికి సీఎం మనవడు హిమాన్షు వ్యాఖ్యలే నిదర్శమని చెబుతున్నారు.
హిమాన్షు వ్యాఖ్యలో తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనేది బయటపడిందని అన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి. ప్రభుత్వం ఏం చేయలేదు.. చేయట్లేదు కాబట్టే హిమాన్షు విరాళాలు సేకరించి స్కూల్‌ని బాగు చేయించాడని అన్నారు. ఈ క్రమంలో తెలంగాణలో అభివృద్ధి జరగాలంటే బీఆర్‌ఎస్‌ను గద్దె దించాలని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చాడు. రాష్ట్రంలో ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ గ్రాఫ్ కూడా పెరుగుతోంది. ఇప్పుడు స్వయంగా సీఎం మనవడు చేసిన వ్యాఖ్యలే ప్రభుత్వ పరువుని తీశాయంటున్నారు పలువురు రాజకీయ నిపుణులు. హిమాన్షే ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి కాంగ్రెస్‌తో పాటు ఇతర పార్టీలకు సువర్ణ అవకాశం కల్పించారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.