కేసీఆర్ ఆలోచనా శక్తి కోల్పోయారు : రేవంత్ రెడ్డి

ఇవాళ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైందని..

By Medi Samrat  Published on  15 Oct 2023 12:18 PM GMT
కేసీఆర్ ఆలోచనా శక్తి కోల్పోయారు : రేవంత్ రెడ్డి

ఇవాళ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైందని.. తొలి జాబితాలో ఉన్నవారికి అభినందనలు తెలిపారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. జూబ్లీహిల్స్ లో ఆయ‌న మాట్లాడుతూ.. మా అభ్యర్థులను ప్రకటించగానే.. కేసీఆర్ వారి అభ్యర్థులకు బీ-ఫామ్ లు పంచారు. అభ్యర్థుల విషయంలో కాంగ్రెస్.. బీఆర్ఎస్ కంటే ముందు ఉందన్నారు. మేం 55 మంది అభ్యర్థులను ప్రకటిస్తే.. కేసీఆర్ కేవలం 51 మందికే బీ ఫామ్ లు ఇచ్చార‌ని అన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను కాపీ కొట్టి బీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రకటించారని విమ‌ర్శించారు.

మా గ్యారంటీలను కాపీ కొట్టి కేసీఆర్ పెద్ద అగాథంలో పడిపోయారని అన్నారు. బీఆర్ఎస్ తన ఉనికిని కోల్పోయింది. కేసీఆర్ ఆలోచనా శక్తి కోల్పోయారని.. బీఆర్ఎస్ కు ఆలోచన, ఆచరణ, సంక్షేమం-అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదన్నారు. మేం ఆరు గ్యారంటీలు ఇస్తామంటే బీఆర్ఎస్ నేతలు అదెలా సాధ్యమన్నారు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ను ప్రశ్నించే అర్హత కోల్పోయారని అన్నారు. కేసీఆర్ లా మేం ఉత్తుత్తి హామీలు ఇవ్వలేదన్నారు. మేం ప్రకటించిన ఆరు గ్యారంటీలను అమలు చేయగలమ‌ని స్ప‌ష్టం చేశారు. వీటి అమలు సాధ్యమని కేసీఆర్ రాజముద్ర వేసి మరీ అంగీకరించారని అన్నారు.

కాంగ్రెస్ హామీలు ఆచరణ సాధ్యమని కేసీఆర్ ప్రెస్ మీట్ తో ప్రజలకు అర్ధమైందన్నారు. అర్థంపర్ధం లేని ఆరోపణలతో బిల్లా రంగాలు కాంగ్రెస్ పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. అందుకే ఎక్కడో డబ్బులు దొరికితే మాపై ఆరోపణలు చేస్తున్నారు. దోపిడీ సొమ్ముతో జాతీయ రాజకీయాలు చేయాలని కేసీఆర్ వైఫల్యం చెందారు. అందుకే చలిజ్వరంతో ఇంట్లో కూర్చున్నారని ఎద్దేవా చేశారు,

కేసీఆర్ కు సూటిగా సవాల్ విసురుతున్నా.. ఈ ఎన్నికల్లో చుక్క మందు పోయకుండా, డబ్బులు పంచకుండా ఓట్లు అడగాలన్నారు. 17న మధ్యాహ్నం 12 గంటలకు అమరవీరుల స్థూపం వద్దకు నేను వస్తా.. కేసీఆర్ నువ్వు అక్కడికి రా.. ప్రమాణం చేద్దాం అన్నారు.

నిజంగా రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీయకపోతే.. ప్రతీ నెల ఉద్యోగులకు , ఆసరా పెన్షనర్లకు ప్రతీ నెలా మొదటి తారీఖు వాళ్ళ ఖాతాలో వేయాలని కేసీఆర్ కు మరో సవాల్ విసురుతున్నాన‌న్నారు. అలా అయితేనే మీరు ప్రకటించిన మేనిఫెస్టోలోని హామీలు అమలు చేస్తారని నమ్ముతామ‌న్నారు. ఇవాళ ప్రెస్ మీట్ లో రాబోయే ఎన్నికల్లో ఓటమిని అంగీకరించిన కేసీఆర్ కనిపించారని.. కాడి కిందపడేసిన కేసీఆర్ కనిపించార‌ని అన్నారు, కేసీఆర్.. మీ పాలనకు ఎక్స్ పైరీ డేట్ అయిపోయింది.. ఇక మీరు విశ్రాంతి తీసుకోండని అన్నారు.

Next Story