స్టూడెంట్ లీడర్ నుంచి.. టీపీసీసీ వరకు ఎదిగిన రేవంత్‌రెడ్డి

రేవంత్‌ రెడ్డి అంటే చాలా మంది యువతకు ఎంతో ఇష్టమైన నాయకుడు.

By Srikanth Gundamalla  Published on  3 Dec 2023 5:15 PM IST
revanth reddy, biography, congress, telangana ,

 స్టూడెంట్ లీడర్ నుంచి.. టీపీసీసీ వరకు ఎదిగిన రేవంత్‌రెడ్డి

రేవంత్‌ రెడ్డి అంటే చాలా మంది యువతకు ఎంతో ఇష్టమైన నాయకుడు. ఆయన ముక్కుసూటి మాటలతో ప్రత్యర్థులను ఇరకాటంలో పెట్టేస్తారు. ఆయనకు కేవలం 15 ఏళ్ల నుంచే రాజకీయాల్లో ఉన్నా 130 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ శాఖకు అధ్యక్షుడిగా ఎన్నిక అయ్యారు. మాస్‌ మాటలతో రేవంత్‌ తనకంటూ ఒక ప్రత్యేక ఫేమ్‌ను సంపాదించుకున్నారు. ఆయన ఏం చేసినా సంచలనమే.. విమర్శలు.. నిరసనలు ఇలా రేవంత్‌రెడ్డి చేసే ప్రతి పని ప్రత్యర్థి పార్టీలకు చెమటలు పట్టిస్తుంటాయి. రేవంత్‌రెడ్డి ఆయన అనుచరులు ముద్దుగా టైగర్‌ అని పిలుచుకుంటారు. పెద్ద నాయకులను సైతం దీటుగా ఎదుర్కొనే నేతగా ఎదిగారు రేవంత్‌రెడ్డి.

అనుముల రేవంత్‌రెడ్డి 1969 ఆగస్టు 8న మహబూబ్‌నగర్‌ జిల్లా కొడారెడ్డి పల్లెలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు దివంగత నరసింహారెడ్డి, రామచంద్రమ్మ. రేవంత్‌రెడ్డి పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో చదివారు. ఇంటర్‌ ఓ ప్రయివేట్‌ కాలేజీలో పూర్తి చేశారు. ఆ తర్వాత ఆయన డిగ్రీ చదవడం కోసం హైదరాబాద్‌కు వచ్చారు. ఉస్మానియాకు అనుబంధ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. రేవంత్‌రెడ్డిలో చిన్నప్పటి నుంచే లీడర్‌ లక్షణాలు ఉండేవి. ఆయన కూడా స్టూడెంట్‌ లీడర్‌గా పనిచేశారు. అయితే..డిగ్రీ తర్వాత రేవంత్‌రెడ్డి సోదరుడితో కలిసి ప్రింటింగ్ ప్రెస్‌ స్టార్ట్‌ చేశారు. అది విజయవంతం అయ్యింది. ఆ తర్వాత మెల్లిగా రియల్‌ ఎస్టేట్‌ రంగంలోకి అడుగుపెట్టారు. ఆర్థికంగా ఇంకాస్త కుదుటపడ్డారు. సంపాదన పెరిగాక రేవంత్‌రెడ్డి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. లైఫ్‌లో కాస్త సెటిల్‌ అయ్యాయని అనుకున్న తర్వాత.. 1992లో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైపాల్‌రెడ్డి సోదరుడి కుమార్తె గీతారెడ్డిని రేవంత్‌రెడ్డి లవ్‌ మ్యారెజ్‌ చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె కూడా ఉంది.

2001 నుంచి 2022 వరకు రేవంత్‌రెడ్డి టీఆర్ఎస్‌ కార్యకర్తగా పనిచేశారు. ఉద్యమ సమయంలో ఏర్పాటు అయ్యిన పార్టీ.. అదీకాక తాను ఉద్యమంలో పాల్గొనడంలో ఇంట్రెస్ట్‌ ఉన్నవ్యక్తి కావడంతో టీఆర్ఎస్‌లో ఏడాదిపాటు కార్యకర్తగా పనిచేశారు. అప్పుడు 2004 నంచి కల్వకుర్తి నుంచి టికెట్‌ ఆశించి భంగపడ్డారు. కూటమి పొత్తుల్లో భాగంగా రేవంత్‌రెడ్డి టికెట్ అందలేదు. 2006లో జెడ్పీటీసీ ఎన్నికల్లో అయినా కేసీఆర్ టికెట్‌ ఇస్తారని ఆశించినా.. మరోసారి ఎదురుదెబ్బే తగిలింది. దాంతో.. టీఆర్ఎస్‌పై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. అప్పటికే రేవంత్‌రెడ్డి కిందిస్థాయి నుంచి పనిచేస్తూ వచ్చిన వ్యక్తి కావడంతో ప్రజల్లో కాస్త బలం ఏర్పడింది.

2008లో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. కేసీఆర్, వైఎస్‌ఆర్‌ వ్యూహాల మధ్య కూడా ఆయన గెలవడంతో ఒక్కసారిగా రేవంత్‌రెడ్డి పేరు రాష్ట్రం మొత్తం బలంగా వినిపించింది. ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత రేవంత్‌రెడ్డి టీడీపీలో చేరారు. టీడీపీలో యాక్టివ్‌గా పనిచేశారు. ఈ క్రమంలో చంద్రబాబు రేవంత్‌రెడ్డికి 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్‌ టికెట్‌ ఇచ్చారు. అయితే.. అప్పుడు టీడీపీ అధికారంలోకి రాకపోయినా.. ఎమ్మెల్యేగా రేవంత్‌రెడ్డి గెలిచారు. దాంతో.. ప్రతిపక్ష నేతగా ఉంటూ టీడీపీ తరఫున గట్టిగా మాట్లాడేవారు.

టీడీపీ ఉమ్మడి ఏపీ నినాదానికి చెందిన పార్టీ అయినా.. రేవంత్‌రెడ్డి మాత్రం తెలంగాణ ఉద్యమంలో యాక్టివ్‌గా పాల్గొన్నారు. కీలక పాత్ర పోషించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత 2014 ఎన్నికల్లో కొడంగల్‌ నుంచే రేవంత్‌రెడ్డి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత కేసీఆర్‌ ఆపరేషన్‌ ఆకర్ష్‌తో టీడీపీ ఎమ్మెల్యే ఎక్కువగా టీఆర్ఎస్‌లో చేరారు. రేవంత్‌రెడ్డి మాత్రం టీడీపీని వీడలేదు. రేవంత్ రెడ్డి రాజకీయ జీవితంలో 2015 ఓటుకు నోటు వివాదం మాయని మచ్చగా నిలిచిపోతుంది.రేవంత్‌ పార్టీని నమ్ముకుని.. పార్టీకోసం నిలబడటంతో 2017లో టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించారు చంద్రబాబు. ఆ తర్వాత రాజకీయ పరిణామాల నేపథ్యంలో రేవంత్‌రెడ్డి 2017 అక్టోబర్‌లోనే కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. రేవంత్ రెడ్డి రాజకీయ జీవితంలో 2015 ఓటుకు నోటు వివాదం మాయని మచ్చగా నిలిచిపోయింది.

కేసీఆర్ సర్కార్‌ ముందుస్తు ఎన్నికలకు వెళ్లడంతో 2018లో జరిగిన ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి మళ్లీ కొడంగల్‌ నుంచే బరిలోకి దిగారు. అప్పుడు కొడంగల్‌లో రేవంత్‌రెడ్డిని ఎలాగైనా ఓడించాలనే లక్ష్యం బీఆర్ఎస్‌లో కనిపించింది. కేసీఆర్ తన అస్త్రాలన్నీ ఉపయోగించారు. రేవంత్‌రెడ్డి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత మరింత ఫాలోయింగ్‌ పెంచుకున్న రేవంత్‌కు.. కాంగ్రెస్‌ 2019లో లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి నుంచి పోటీ చేసే అవకాశం కల్పించింది. ఈ ఎన్నికల్లో రేవంత్‌ మర్రి రాజశేఖర్‌రెడ్డిపై గెలుపొందారు. మొదటిసారి పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. 2021 జూన్‌ 26లో పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌ను కాంగ్రెస్ నియమించింది. రాజకీయ పరిణామాల నేపథ్యంలో జూలై 7న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్ సమక్షంలో టీపీసీపీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు.

కాంగ్రెస్‌ను తెలంగాణలో ముందుకు తీసుకెళ్లానని రేవంత్‌రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం పీసీసీ పగ్గాలను అందించింది. అయితే.. రేవంత్‌రెడ్డి పీసీసీ ఇవ్వడంపై పలువురు సీనియర్‌ నేతలు అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయినా ఆయన అవేమీ పెద్దగా పట్టించుకోలేదు. ఆయా నాయకులతో మాట్లాడుతూ కాంగ్రెస్‌ను రాష్ట్రంలో మరింత బలోపేతం చేసి.. అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేశారు. ఈ నేపథ్యంలో ఆయన కామారెడ్డిలో కేసీఆర్ నిలబడితే ఆయకు పోటీగా నిలబడ్డారు. కానీ.. ఇక్కడ వీరిద్దరీని కాదని బీజేపీని గెలిపించారు అక్కడి ప్రజలు. కొడంగల్‌లో మరోసారి పోటీ చేసి అక్కడా ఘన విజయం సాధించారు. కాంగ్రెస్‌ను గెలిపించడమే లక్ష్యంగా పెట్టుకున్న రేవంత్‌రెడ్డి.. చివరకు అందరు నాయకులను కలుపుకొని తెలంగాణలో కాంగ్రెస్‌ విజయంలో గెలుపునకు కీలక పాత్ర పోషించారు.

అలాగే.. ఇప్పుడు కాంగ్రెస్‌ అధికారం చేపడితే సీఎం అభ్యర్తి ఎవరనేదానిపై చర్చ కొనసాగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్‌లో ఉన్న సీనియర్‌ నాయకులు తమకు అవకాశం వస్తే బాగుంటుందని ఆశపడుతున్నారు. అంతేకాదు.. గతంలో తామే సీఎం అభ్యర్థి అంటూ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తోపాటు పలువురు ప్రచారం కూడా చేసుకున్నారు. ఈ నేపథ్యంలో సీఎం ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్‌ అధిష్టానం నిర్ణయించిన వారినే ముఖ్యమంత్రిని చేయనున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే.. టీపీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్‌రెడ్డి కూడా సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి.

Next Story