కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్ ఇదే.. ప్రియాంక గాంధీ సమక్షంలో ప్రకటించిన రేవంత్
Revanth declared Congress Youth Declaration in the presence of Priyanka Gandhi. కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ ను ప్రియాంక గాంధీ సమక్షంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటించారు.
By Medi Samrat Published on 8 May 2023 6:38 PM ISTకాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ ను ప్రియాంక గాంధీ సమక్షంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటించారు. అమరవీరులు, ఉద్యమకారుల త్యాగాలకు గుర్తింపు, నిరుద్యోగులకు ఉద్యోగ భరోసా లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ యూత్ డిక్లరేషన్ ను ప్రకటించింది.
యూత్ డిక్లరేషన్ ముఖ్యాంశాలు :
• తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాలలో ప్రాణాలర్పించిన యువతీ, యువకులను ఉద్యమ అమరవీరులుగా గుర్తించి, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం.. తల్లి/తండ్రి/భార్యకు రూ. 25,000ల నెలవారీ అమరవీరుల గౌరవ పెన్షన్ అందజేత.
• ఉద్యమంలో పాల్గొన్న యువతపై నమోదైన కేసులను ఎత్తివేయడంతో పాటు, జూన్ 2న వారికి తెలంగాణ ఉద్యమకారులుగా ప్రభుత్వ గుర్తింపు కార్డు అందజేత.
• మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ.
• మొదటి ఏడాదిలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ.
• ప్రతీ ఏడాది జూన్ 2 నాటికి అన్ని శాఖల్లోని ఖాళీలతో జాబ్ క్యాలెండర్ ప్రకటించి, సెప్టెంబర్ 17 లోపు నియామకాల పూర్తి.
• నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించే వరకు ప్రతీ నెలా రూ. 4,000 నిరుద్యోగ భృతి చెల్లింపు.
• ప్రత్యేక చట్టంతో టీఎస్ పీఎస్సీని ప్రక్షాళన చేసి యూపీఎస్సీ తరహాలో పునరుద్ధరణ.
• కాంగ్రెస్ హయాంలో నిరుద్యోగ రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు సెంట్రలైజ్డ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పోర్టల్ను ఏర్పాటు చేసి, 7 జోన్లలో ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్లను, ప్రతి జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను నెలకొల్పడం.
• ప్రభుత్వ రాయితీలు పొందిన ప్రైవేట్ కంపెనీల్లో తెలంగాణ యువతకు 75% రిజర్వేషన్ కల్పన.
• విద్య, ఉపాధి అవకాశాలను మెరుగుపర్చేందుకు యూత్ కమిషన్ను ఏర్పాటు చేసి, రూ. 10 లక్షల వరకు వడ్డీ లేని రుణ సదుపాయ కల్పన.
• ప్రత్యేక గల్ఫ్ విభాగం ఏర్పాటుతో గల్ఫ్ ఏజెంట్ల నియంత్రణ, గల్ఫ్ దేశాల్లో మెరుగైన ఉపాధి కల్పనతో పాటు, గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి తగిన చర్యలు.
• ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈడబ్ల్యూఎస్ వర్గాల విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్మెంట్తో పాటు, పాత బకాయిలు పూర్తిగా చెల్లింపు.
• పాలమూరు, తెలంగాణ, మహాత్మా గాంధీ, శాతవాహన యూనివర్సిటీలను ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీలుగా మార్చడంతో పాటు, ఆదిలాబాద్, ఖమ్మం, మెదక్ లో నూతన ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీల ఏర్పాటు.
• బాసరలోని రాజీవ్ గాంధీ IIIT తరహాలో 4 నూతన IIIT లను ఏర్పాటు చేసి, గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం.
• అమెరికాలోని IMG అకాడమీ తరహాలో అన్ని వసతులతో కూడిన ప్రపంచస్థాయి క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసి, గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడం.
• పోలీసు, ఆర్టీసీ ఉద్యోగుల పిల్లల కోసం వరంగల్, హైదరాబాద్లలో 2 విద్యాలయాలను ఏర్పాటు చేసి, 6వ తరగతి నుండి పట్టభద్రులయ్యేవరకు నాణ్యమైన విద్యను అందించడం.
• 18 సం||లు పైబడి, చదువుకొనే ప్రతీ యువతికి ఎలక్ట్రిక్ స్కూటర్ల అందజేత.