Hyderabad: 'రెస్టారెంట్‌ ఆన్‌ వీల్స్‌'.. 24 అవర్స్‌ ఓపెన్‌

హైదరాబాద్‌: ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడానికి కాచిగూడ రైల్వే స్టేషన్​ఆవరణలో రెస్టారెంట్ ఆన్​వీల్స్ హోటల్‌‌‌‌ను సోమవారం సౌత్‌ సెంట్రల్‌ రైల్వే ప్రారంభించింది.

By అంజి  Published on  25 July 2023 6:00 AM GMT
Restaurant on Wheels, Kacheguda railway station, Hyderabad, South Central Railway

Hyderabad: 'రెస్టారెంట్‌ ఆన్‌ వీల్స్‌'.. 24 అవర్స్‌ ఓపెన్‌

హైదరాబాద్‌: ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడానికి కాచిగూడ రైల్వే స్టేషన్​ఆవరణలో రెస్టారెంట్ ఆన్​వీల్స్ హోటల్‌‌‌‌ను సోమవారం సౌత్‌ సెంట్రల్‌ రైల్వే ప్రారంభించింది. తెలంగాణలో మొదటిసారిగా రైల్వే కోచ్​లో రెస్టారెంట్​ను అందుబాటులోకి తెచ్చింది. భోజన ప్రియులకు ప్రత్యేకమైన భోజనం, వినూత్న అనుభూతిని అందించేందుకు దీన్ని ఏర్పాటు చేశారు. ఇక ఈ రెస్టారెంట్‌ 24 గంటలూ తెరిచే ఉంటుంది. నగరంలో సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌తో చాలా రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో కాచిగూడ ఒకటి. ఇక్కడి నుంచి నిత్యం వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు.

ఈ క్రమంలోనే ప్రయాణికులకు క్వాలిటీ, వినూత్న అనుభూతితో భోజనం అందించేందుకు ఈ రెస్టారెంట్‌ని ప్రారంభించినట్టు సౌత్‌ సెంట్రల్‌ రైల్వే అధికారులు తెలిపారు. ఈ రెస్టారెంట్‌ కోసం రెండు హెరిటేజ్‌ కోచ్‌లను ప్రయాణికులను ఆకట్టుకునే విధంగా ఇంటీరియర్స్‌తో అద్భుతంగా తీర్చిదిద్దారు. సికింద్రాబాద్‌కు చెందిన 'హావ్‌ మోర్‌' అనే సంస్థకు ఐదేళ్ల పాటు ఈ రెస్టారెంట్‌ని లీజ్‌కు ఇచ్చారు. ఇక ఈ రెస్టారెంట్‌లో సౌత్‌ ఇండియన్‌, నార్త్‌ ఇండియన్‌, మొఘలాయ్‌, చైనీస్‌ వంటకాలు లభిస్తాయి.

కాచిగూడ రైల్వే స్టేషన్‌ మెయిన్‌ ఎంట్రెన్స్‌ సమీపంలో ఈ మల్టీ క్యూసిన్‌ రెస్టారెంట్‌ ఉంటుంది. రైలు ప్రయాణికులతో పాటు సాధారణ ప్రజలకు ఈ రెస్టారెంట్‌ 24 గంటల పాటు అందుబాటులో ఉంటుందని సౌత్‌ సెంట్రల్‌ రైల్వే జీఎం అరుణ్‌ కుమాన్‌ జైన్‌ తెలిపారు. హెరిటేజ్ కోచ్‌లను రెస్టారెంట్‌గా మార్చిన హైదరాబాద్ డివిజన్ అధికారులను, సిబ్బందిని జైన్ అభినందించారు. హైదరాబాద్‌లోని ఆహార ప్రియులకు ఇది ఓ మంచి అనుభూతిని ఇస్తుందని అన్నారు. రైల్వే డిపార్ట్‌మెంట్‌ చేపడుతున్న ప్రత్యేక కార్యక్రమాలను ఆదరించాలని ఆయన కోరారు.

Next Story