నా వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తున్నా: సీఎం రేవంత్‌

బీఆర్‌ఎస్‌ నాయకురాలు కవిత బెయిల్‌ పట్ల తాను చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంపై సీఎం రేవంత్‌ రెడ్డి స్పందించారు.

By అంజి  Published on  30 Aug 2024 6:30 AM GMT
Telangana, CM Revanth, Supreme Court, MLC Kavitha

నా వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తున్నా: సీఎం రేవంత్‌

బీఆర్‌ఎస్‌ నాయకురాలు కవిత బెయిల్‌ పట్ల తాను చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంపై సీఎం రేవంత్‌ రెడ్డి స్పందించారు. భారత న్యాయవ్యవస్థపై తనకు అంతులేని విశ్వాసం ఉందన్నారు. కొన్ని వార్తపత్రికలు తన వ్యాఖ్యలను తప్పుగా అన్వయించి, కోర్టును కించపరిచినట్టు పేర్కొన్నాయన్నారు. ఏదేమైనా న్యాయవ్యవస్థ, దాని స్వతంత్రతను నమ్మే వ్యక్తిగా తన వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేస్తున్నట్టు సీఎం రేవంత్‌ ట్వీట్‌ చేశారు.

“భారత న్యాయవ్యవస్థపై నాకు అత్యున్నత గౌరవం, పూర్తి విశ్వాసం ఉంది. నాకు ఆపాదించబడిన వ్యాఖ్యలను కలిగి ఉన్న 29 ఆగస్టు, 2024 నాటి కొన్ని పత్రికా నివేదికలు నేను గౌరవనీయ న్యాయస్థానం యొక్క న్యాయపరమైన విజ్ఞతను ప్రశ్నిస్తున్నాను అనే అభిప్రాయాన్ని ఇచ్చాయని నేను అర్థం చేసుకున్నాను. నేను న్యాయ ప్రక్రియను గట్టిగా నమ్ముతానని పునరుద్ఘాటిస్తున్నాను. పత్రికా నివేదికలలో ప్రతిబింబించే ప్రకటనల పట్ల బేషరతుగా నా విచారం వ్యక్తం చేస్తున్నాను”అని ఆయన ఎక్స్‌లో అన్నారు.

ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసుల్లో బీఆర్‌ఎస్ నాయకురాలు కవితకు బెయిల్ మంజూరు చేయడంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆగస్టు 29వ తేదీ గురువారం సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కవితకు బెయిల్‌ కోసం బీజేపీ, బీఆర్‌ఎస్‌ల మధ్య జరిగిన డీల్‌పై రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు సుప్రీంకోర్టుకు ఆగ్రహం తెప్పించాయి. “ఇది ఒక సీఎం చేయవలసిన ప్రకటననా?” అని జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రశ్నించింది, అలాంటి ప్రకటనలు ప్రజల మనస్సులలో భయాందోళనలను కలిగిస్తాయని అన్నారు.

అయితే తన ఆదేశాలపై వచ్చిన విమర్శల వల్ల ఇబ్బంది లేదని కోర్టు పేర్కొంది. మా మనస్సాక్షి ప్రకారం మేము మా కర్తవ్యం చేస్తాము. రాజ్యాంగం ప్రకారం ప్రమాణం చేయబడ్డాము అని ధర్మాసనం జోడించింది.

Next Story