పోలీస్‌ స్టేషన్ ముందు రీల్..యువకుడి తిక్క కుదిర్చిన పోలీసులు

సోషల్‌ మీడియాలో ఫేమస్‌ అవ్వడం కోసం యువకులు ఎన్నో వింత వింత చేష్టలు చేస్తున్నారు.

By Srikanth Gundamalla  Published on  30 Dec 2023 9:50 AM GMT
reel Vs jail, viral video, young man arrested, hyderabad ,

పోలీస్‌ స్టేషన్ ముందు రీల్..యువకుడి తిక్క కుదిర్చిన పోలీసులు

సోషల్‌ మీడియాలో ఫేమస్‌ అవ్వడం కోసం యువకులు ఎన్నో వింత వింత చేష్టలు చేస్తున్నారు. కొన్నిసార్లు అయితే హద్దులు మీరి ప్రవర్తిస్తూ చిక్కుల్లో పడుతున్నారు. ముఖ్యంగా రీల్స్‌ పేరుతో కొందరైతే తమ ప్రాణాలపైకే తెచ్చుకున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఓ యువకుడు ఏకంగం పోలీస్‌ స్టేషన్‌ ముందే రీల్‌ చేశాడు. ఆ యువకుడి ఓవరాక్షన్‌ కు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దీనిపై స్పందించిన పోలీసులు సదురు పోకిరీని జైలుకు పంపించారు. తద్వారా అతడి తిక్కను కుదిర్చారు.

సికింద్రాబాద్ రాంగోపాలపేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ సంఘటన జరిగింది. వంశీకృష్ణ అనే యవకుడు రామ్‌గోపాల్ పేట పోలీస్‌ స్టేషన్‌ ముందు రాత్రి వేళ వచ్చాడు. గంజాయి తాగుతూ.. ఓ ర్యాప్‌ సాంగ్‌కు అతను రీల్‌ చేశారు. రీల్‌ చేసి అతని దగ్గరే దాచుకోక.. దాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేశాడు. అయితే.. ఈ వీడియోను చూసిన పలువురు నెటిజన్లు వంశీకృష్ణ పోస్టుపై విమర్శలు చేశారు. ఇలా చేయడం సరికాదని చెప్పుకొచ్చారు. కొందరైతే ఏకంగా సీఎం రేవంత్‌రెడ్డికి ట్విట్టర్‌లో ఈ వీడియోను ట్యాగ్ చేశారు. దాంతో.. ఈ విషయంపై పోలీసులు వెంటనే స్పందించారు. సదురు వ్యక్తిని వీడియో ఆధారంగా అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేసి న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. ఈ సంఘటనపై విచారణ జరిపిన న్యాయవాది వంశీకృష్ణకు ఎనిమిది రోజుల జైలు శిక్షను విధించారు.

అయితే పోలీసులు ఆ యువకున్ని అరెస్ట్ చేయడంతో పాటు రీల్‌ వర్సెస్‌ జైలు అనే పేరుతో పాత వీడియోను.. కొత్త వీడియోను కలిపి ఒకటి క్రియేట్ చేశారు. వంశీకృష్ణను చంచల్‌గూడ జైలుకు పంపించే వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్‌ చేశారు. దానికి రీల్‌ వర్సెస్‌ జైల్ అని ట్యాగ్‌లైన్ ఇచ్చారు. ఇలాంటి ఓవరాక్షన్ పనులు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు పోలీసులు. కాగా.. ఇప్పటికే మత్తుపదార్థాలను బ్యాన్‌ చేయాలనే లక్ష్యంతో పోలీసులు పనిచేస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి కూడా ఈ మేరకు రాష్ట్రంలో ఎక్కడా గంజాయి మాట వినపడొద్దనే ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు గంజాయి సరఫరాపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టారు. గంజాయి, డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాల జోలికి వెళ్తే కఠినచర్యలు తప్పవంటున్నారు.


Next Story