హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మరో బిగ్ అప్‌డేట్ వచ్చింది. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో భాగంగా గ్రామాల్లో అధికారులు రీవెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభించారు. ఈ ఫైనాన్షియల్ ఇయర్‌లో ఒక్కో నియోజకవర్గంలో 3,500 ఇళ్లను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జనవరి 26వ తేదీన రాష్ట్రంలోని మండలానికి ఒక గ్రామం చొప్పున మొత్తం 562 పంచాయతీల్లో ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. అప్పుడే అర్హుల లిస్ట్‌ను ప్రకటించారు. మొదటి విడతలో 72,045 మందికి ఇళ్లను శాంక్షన్ చేశారు.
అయితే ఇప్పుడు ఆయా మండలాల్లోని మిగతా గ్రామాల్లో అర్హుల ఎంపికపై అధికారులు దృష్టి పెట్టారు. ఇప్పటికే అధికారులు.. ఇందిరమ్మ ఇళ్ల యాప్ ద్వారా దరఖాస్తుదారుల పూర్తి వివరాలు నమోదు చేశారు. దరఖాస్తుదారులను మూడు జాబితాలుగా విభజించారు. ఇలా మొదటి విడత పరిశీలన పూర్తి కాగా.. సొంత స్థలాలు ఉన్న వారికి సంబంధించి రీవెరిఫికేషన్ జరుగుతోంది. ఈ లిస్ట్‌లో 21.93 లక్షల మంది దరఖాస్తుదారులు ఉన్నారు. వీరిలో అతి పేదలను గుర్తించి ఇళ్లు మంజూరు చేయనున్నారు. రీ వెరిఫికేషన్ కోసం ఒక్కో మండలానికి నాలుగైదు బృందాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.